బద్వేలు టీడీపీలో అంతర్యుద్ధం..!


     ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల సమావేశం

     నాకెలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా సమావేశం నిర్వహిస్తావ్..

     ఎమ్మెల్యేకి ఫోన్‌చేసి నిలదీసిన టీడీపీ నేత విజయజ్యోతి


 

కడప: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు టీడీపీలో అంతర్యుద్ధం నెలకొంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కిందని ఓ నేత భావించగా, అంతలోనే పానకంలో పుడకలా మరోనేత అడ్డుతగిలారు. అవకాశవాద రాజకీయాల ముందు ప్రభుత్వ ఉద్యోగం త్యాగం చేసిన గుర్తింపు సైతం కరువైంది. వెరసి తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. మంగళవారం నిర్వహించిన ఓ సమావేశం కారణంగా  విభేదాలను బహిర్గతం చేసిన వైనమిది.




బ్యాంకు ఉద్యోగిగా విజయజ్యోతి బద్వేలు నియోజకవర్గ వాసులకు సుపరిచితురాలు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆమె బ్యాంకు ఉద్యోగం త్యజించారు. ఆపై ప్రత్యక్షరాజకీయాలలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైఎస్సార్‌సీపీకి ఉన్న అపార కేడర్ కారణంగా ఓటమి పాలయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఓవైపు విజయజ్యోతి, మరోవైపు విజయమ్మ పోటీ పడుతూ ప్రత్యక్ష పోరాటం నిర్వహించారు.



ఈ క్రమంలో విజయజ్యోతికి యోగివేమన యానివర్శిటీ పాలకమండలి సభ్యురాలిగా పదవి కట్టబెట్టారు. కాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గా ఎన్నికైన జయరాములు అవకాశవాద రాజకీయాల కారణంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం టీడీపీ నేత విజయజ్యోతికి ఏమాత్రం రుచించడం లేదని పరిశీలకుల భావన. ఎలాగైనా పార్టీకోసం కలుపుగోలుగా వెళ్లాలని భావించినా, ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే భావనకు ఆమె వచ్చిన ట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంపై మండిపడ్డట్లు సమాచారం.



సమాచారమే లేకుండా ఎలా నిర్వహిస్తావ్..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేశాను. వైవీయూ మెంబర్‌గా ఉన్నా. నాకు సమాచారమే లేకుండా మాజీ ఎమ్మెల్యేతో కలిసి అధికారులతో ఎలా సమావేశం నిర్వహిస్తావంటూ విజయజ్యోతి స్వయంగా ఎమ్మెల్యే జయరాములుకు ఫోన్ చేసినట్లు సమచారం. ప్రోటోకాల్ రీత్యా తనకు అధికారుల సమావేశానికి వెళ్లే అర్హత ఉంది. పార్టీని కలుపుగోలుగా వెళ్లాలంటే సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి, అలా కాకుండా ఏకపక్షంగా సమావేశం నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ఆమె నిలదీసినట్లు సమచారం. ఓ దినపత్రిక నిర్వహించిన సమావేశానికి మాత్రమే హాజరయ్యానని చెప్పుకొచ్చినట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యే జయరాములు వైఖరిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ నేత విజయజ్యోతి సాక్షికి ధ్రువీకరించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top