పెందుర్తి ఒరలో రెండో కత్తి


ఇటు బండారు.. అటు బాబ్జీ

పార్టీ నిర్ణయంతో ఎమ్మెల్యే కినుక

పెత్తనం కోసం బాబ్జీ పావులు

ఇరకాటంలో అధికారులు, కార్యకర్తలు

 

విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ బృందం టీడీపీలో చేరడంతో పెందుర్తి నియోజకవర్గ పార్టీలో ముసలం పుట్టింది. మొదటి నుంచి బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పార్టీ తీరుతో కినుక వహించారు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. దీనిపై ఎవరు కదిపినా నో కామెంట్ అంటూ దాట వేస్తున్నారు. తాను ఎంత చెప్పినా పట్టించుకోకుండా బాబ్జీని పార్టీలో చేర్చుకోవడాన్ని బండారు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఇప్పటికే పార్టీ నగర మాజీ అధ్యక్షుడు పల్లా శ్రీను వర్గం పక్కలో బల్లెంలా ఉండగా ఇప్పుడు బాబ్జీ రాక బండారుకు మరింత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బండారు పుత్రరత్నం అప్పలనాయుడు చేష్టలతో గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్లను, ఆయన వ్యతిరేక వర్గీయులను తనవైపు తిప్పుకునేందుకు బాబ్జీ పావులు కదుపుతున్నారు.


ఇప్పటికే కొందరు బాబ్జీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. పరవాడ, పెందుర్తి, సబ్బవరంలలో బండారుతో విభేదించిన నేతలంతా ఇప్పటి వరకు ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పీలాశ్రీను వెంటనడుస్తున్నారు. వీరందర్ని తన వైపు తిప్పుకొని బాబ్జీమూడో కుంపటి పెడుతున్నారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది.

 

ఆధిపత్యం కోసం పోటీ

బండారు ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బాబ్జీ అనుచరులు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలో చేరకముందు నుంచే వారు అధికారులపై పెత్తనం చలాయించడం మొదలు పెట్టారు. ఇప్పుడు పార్టీలో చేరడంతో ఈ రెండువర్గాల మధ్య అధికారులు నలిగిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి.


ఎమ్మెల్యేను కాబట్టి నా మాటే వినాలని బండారు.. రానున్న ఎన్నికల్లో టికెట్ నాదే కాబట్టి నా మాట వినాలంటూ బాబ్జీ పెత్తనం విషయంలో పోటీపడుతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడి ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇరువురు నేతలు ఇప్పుడు ఒకేపార్టీలో ఉండడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి.

 

అసలే పీలా శ్రీనివాస్ వర్గంతో చచ్చిపోతున్నాం..ఇప్పుడు గండి బాబ్జీ వర్గంతో వేగలేమని ఎమ్మెల్యే బండారు తన ముఖ్య అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఈ విషయంలో బండారును బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చేరిక సమావేశానికి మాత్రం బండారును రప్పించలేకపోయారు. బండారే కాదు..గంటా వర్గానికి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 

సీటు దగ్గరే తేడా: వాస్తవానికి గ్రామస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు అధికారంతో పనిలేకుండా స్థానికంగా అజమాయిషీ చెలాయిస్తున్నారు. జన్మభూమి కమిటీలతో పాటు కమిటీయేతర టీడీపీ నాయకులు కూడా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల కంటే ముందు వారికే సీట్లు కేటాయించాలని హుకుం జారీ చేస్తున్నారు.


ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు టీడీపీలో గండి బాబ్జీ చేరిక తరువాత అదే గ్రామాల్లో మరో టీడీపీ వర్గం తయారైంది. అంటే అదే వేదికలపై వారికి కూడా సీట్లు కేటాయించాలి. అయితే ఎవరి సీటు వెనుక వేయాలో ఎవరిది ముందు వేయాలో అధికారులకు కత్తిమీద సామే. సీటు దగ్గరే ఇంత ఉంటే ఇక పనులు విషయంతో ఎంత రాద్దాంతం జరుగుతుందో అని అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top