పొలాల మధ్య పంట సంజీవనులు

పొలాల మధ్య పంట సంజీవనులు - Sakshi


సాక్షి, విజయవాడ బ్యూరో: పంట సంజీవనుల పేరుతో పొలాల మధ్య చెరువులు తవ్వించి సాగుకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పది హెక్టార్లకు ఒక చెరువు చొప్పున అనంతపురం జిల్లాలో లక్ష, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల మెట్ట ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు లక్షల చెరువులు తవ్విస్తామని తెలిపారు. మంగళవారం జలవనరుల శాఖ కార్యాలయంలో.. రాష్ట్రంలో ఆ శాఖకు సంబంధించిన వివరాలతో ముద్రించిన ‘నీరు-ప్రగతి’ పుస్తకాన్ని శ్వేతపత్రం పేరుతో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల్లో నిల్వ చేసిన నీటిని వర్షాభావం, కరువు సమయాల్లో మొబైల్ స్ప్రింక్లర్లు, డ్రిప్‌ల ద్వారా పంటలకు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.



తొలుత పైలట్ ప్రాజెక్టు కింద అనంతపురంలోని పది వేల ఎకరాల్లో ఈ చెరువులను తవ్విస్తామని, ఇందుకు రూ.100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువులు తవ్వడానికయ్యే ఖర్చునంతటినీ ప్రభుత్వమే భరిస్తుందని, ఉపాధి హామీ పథకాన్ని దీనికి కలిపి కార్మికులతో ఈ చెరువులను తవ్విస్తామన్నారు. మూడు రకాల చెరువులకు డిజైన్లు రూపొందిస్తామని, రైతులు ముందుకువచ్చి సామూహికంగా లేదా వీలును బట్టి చెరువులు తవ్వుకోవాలని కోరారు. రాష్ట్రంలో 1.99 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందని ఇదంతా సాగవ్వాలంటే 2,390 టీఎంసీల నీరు అవసరమని సీఎం చెప్పారు. తాగునీటికి 86, పరిశ్రమలకు 240, ఇతర అవసరాలకు 34 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు.



రాష్ట్రంలో సగటున 940 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, అనంతపురం జిల్లాలో సగటున 550, కోస్తా జిల్లాల్లో సగటున 1250 మిల్లిమీటర్ల వర్షం కురుస్తుందని తెలిపారు. ఈ వర్షపాతాన్నంతటినీ లెక్కిస్తే 5 వేల టీఎంసీలవుతుందని చెప్పారు. అయితే ఇందులో 40 శాతం ఆవిరైపోతోందని, 9 శాతం భూగర్భంలోకి ఇంకిపోతోందని చెప్పారు. ఇక గోదావరి, కృష్ణ, పెన్న వంటి పెద్ద నదులు నాగావళి, వంశధార, చంపావతి, శారద, వరాహ, తాండవ, ఏలేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు వంటి 37 చిన్న, మధ్య తరహా నదుల నుంచి 1,916 టీఎంసీల నీరు లభ్యమవుతోందని చెప్పారు. వర్షాలు, నదుల నుంచి వచ్చే నీరు, వినియోగమయ్యే నీటిని లెక్కిస్తున్నామన్నారు. శ్రీశైలం-పెన్నా, నాగార్జున్‌సాగర్-సోమశిల ప్రాజెక్టుల అనుసంధానంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఇవిగాక ఇంకా పలు ప్రతిపాదలున్నట్లు చెప్పారు. వీటన్నింటితో స్మార్ట్ వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2018 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువల్లోకి నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.



 జిల్లా స్థాయిలో జలదర్శినిలు

 నీరు-ప్రగతి పేరుతో రాష్ట్రస్థాయిలో ముద్రించినట్లే జిల్లాస్థాయిలో జలదర్శినిలు ముద్రించామని, త్వరలో మండలస్థాయిలోనూ ముద్రిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి పది చదరపు కిలోమీటరు పరిధిలో ఒక వర్షపాతాన్ని నమోదు చేసే ఫిజియో మీటర్ ఏర్పాటు చేస్తామని, పడుతున్న వర్షాన్ని కాలువలు, చెరువుల్లోకి మళ్లించే విధానాన్ని రూపొందిస్తామన్నారు. నీరు డబ్బుతో సమానమని డబ్బును బ్యాంకుల్లో దాచుకున్నట్లే నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవాలన్నారు. జలవనరులపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, నీటి వినియోగదారుల సంఘాలన్నింటిలోనూ చర్చ జరిపి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. తొలుత జలవనరుల శాఖ కార్యాలయంలో రియల్‌టైమ్ గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ ఫిజియో మీటర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

 

 టీడీపీకి కార్యకర్తలే అండ : చంద్రబాబు

వేమూరులో జన చైతన్య యాత్ర ప్రారంభించిన సీఎం

 
తెనాలి అర్బన్:  తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచింది కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో జన చైతన్య యాత్రను ఆయన సోమవారం ప్రారంభించారు. టీడీపీని కొందరు నాయకులు వంచించినా కార్యకర్తలు అండగా నిలిచారని చెప్పారు. టీడీపీ పాలనను, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. జన చైతన్య యాత్రలో పాల్గొని ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికబద్ధంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని ఉద్ఘాటించారు. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.



 ‘సాక్షిై’పె విమర్శలు: సాక్షి దిన పత్రికపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. వేమూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఆ పత్రికను చదవ వద్దని, అన్నీ వక్రీకరించి రాస్తున్నారని ఆరోపించారు. సాక్షి పత్రిక చదువుతుంటే తనకు మతి భ్రమిస్తుందన్నారు. నాటి కాంగ్రెస్ పాలకులు వారి కుటుంబాల సంక్షేమం కోసమే పనిచేశారని విమర్శించారు. తాను మాత్రం ఇచ్చిన హామీలు అమలు పరుస్తూ రైతులను, పేదలను ఆదుకుంటున్నట్లు స్పష్టం చేశారు.



 సీఐఐ సదస్సు ప్రతిష్టాత్మకం

 సాక్షి, విజయవాడ బ్యూరో:  విశాఖపట్నంలో జనవరి 10 నుంచి 12 వరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ(సీఐఐ) భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సదస్సు ఏర్పాట్లపై ఆయన మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top