సీఐడీ శ్రీముఖాలు


పన్ను ఎగవేసిన రైస్‌ మిల్లుల యజమానులకు నోటీసులు జారీ

వ్యాపార లావాదేవీలకు రికార్డులివ్వాలని నోటీసుల్లో పేర్కొన్న సీఐడీ

రికార్డుల్లేవన్న యజమానులు..

లిఖిత పూర్వక డిక్లరేషన్‌ తీçసుకున్న వైనం..

కేసు దర్యాప్తులో ఒక్కో అడుగు ముందుకు..


నిజామాబాద్‌ :

వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేత కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పటి వరకు కేవలం శివరాజ్, అతని కుమారుడు, ముగ్గురు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులపై మాత్రమే కేసులు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు పన్ను ఎగవేసిన రైస్‌ మిల్లుల యజమానులపై కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు రైస్‌ మిల్లుల యజమానులకు నోటీసులు(శ్రీముఖాలు) జారీ చేసింది.


మీరు నిర్వహించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు వెంటనే సమర్పించాలని సీఐడీ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులు ఇచ్చిన వారిలో కొన్ని రైసుమిల్లుల యజమానులపై పిలిపించుకుని ప్రశ్నించారు. తమ వద్ద ఎలాంటి రికార్డులు లేవని రైస్‌ మిల్లుల యజమానులు సీఐడీ అధికారులకు చెప్పారు.


దీంతో వారి నుంచి లిఖిత పూర్వకంగా డిక్లరేషన్‌ తీసుకుని పంపి వేశారు. ఈ కేసులో సీఐడీ అధికారులు దూకుడు ప్రారంభించడంతో ఈ నోటీసులు అందుకున్న పలువురు రైస్‌ మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో పన్ను ఎగవేసిన ఈ రైస్‌ మిల్లుల యజమానులపై కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధ్దమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అనంతరం అరెస్టుల పర్వం కూడా లేకపోలేదని స్పష్టమవుతుండటంతో వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో 2012 నుంచి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వాణిజ్యపన్నుల శాఖ ముందుగా భావించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన వాణిజ్యపన్నుల శాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో 119 మంది రైస్‌ మిల్లుల యజమానులు సుమారు రూ.65 కోట్లు పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టడంతో 2005 నుంచే ఈ బాగోతం కొనసాగిందని నిర్ధారణకు వచ్చారు. వీరు సర్కారుకు ఎగవేసిన సొమ్ము రూ.65 కోట్లు కాదని, సుమారు రూ.350 కోట్లపైనే ఉంటుందని ఆ శాఖ నిర్ధారణకు వచ్చింది. తవ్వే కొద్దీ ఈ రైసుమిల్లర్ల అక్రమాలు వెలుగుచూస్తుండటంతో సీఐడీ అధికారులు ఈ కేసులో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.


సానుభూతి కోసం యత్నాలు..

ప్రభుత్వానికి రూ.వందల కోట్లు పన్ను ఎగవేసి కోట్లకు పడగలెత్తిన ఈ రైస్‌ మిల్లుల యజమానులు ఇప్పుడు వారిపై సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. తమపై నుంచి ఎగవేసిన పన్ను వసూలు చేస్తే రైస్‌ మిల్లు ఇండస్ట్రీ కోలుకోలేకుండా పోతుందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.


జిల్లాలో చాలామంది రైస్‌ మిల్లుల వ్యాపారులు ఇలా వాణిజ్య పన్నుల శాఖకు రూ.వందల కోట్లు పన్ను ఎగవేయడమే కాకుండా, పౌర సరఫరాల శాఖకు కూడా సీఎంఆర్‌ బియ్యంలో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. ఇలా ఈ వ్యాపారం నుంచి దండుకున్న డబ్బులను చాలా మంది బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి, కోట్లకు పడగలెత్తారు. తీరా ఇప్పుడు తమపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఇండస్ట్రీకే కోలుకోలేని దెబ్బపడుతుందనే అసత్య వాదనను పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద వినిపిస్తుండటం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top