'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకథ

అభిమానుల ఆగ్రహం..థియేటర్‌ ధ్వంసం

Sakshi | Updated: January 11, 2017 17:57 (IST)
అభిమానుల ఆగ్రహం..థియేటర్‌ ధ్వంసం

వేమూరు(గుంటూరు): పదేళ్ల అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 చిత్రంలో ఒకానొక సందర్భంలో కొల్లూరు పేరు వినిపిస్తుంది. అసలే చిరంజీవిపై అభిమానం... పైగా తమ అభిమాన హీరో నోటి వెంట తమ ఊరిపేరు వినిపించడం. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని కొల్లూరు గ్రామస్తులు ఉవ్విళ్లూరారు. అర్ధరాత్రి సినిమా చూపిస్తామని చెప్పి టిక్కెట్లు అమ్మి, తీరా తెల్లవారుజాము వరకు సినిమా ప్రదర్శించకపోవడంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. వారి ఆగ్రహానికి థియేటర్‌ స్క్రీన్‌ చిరిగిపోయింది. కుర్చీలు ముక్కలయ్యాయి. తలుపులు పగిలిపోయాయి. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 చిత్రం విడుదలైన స్థానిక శ్రీనివాస టాకీస్‌ నిర్వాహకులు, చిత్రం కొనుగోలుదారుల నుంచి వేరే వ్యక్తులు ఫ్యాన్స్‌ కోసం బెనిఫిట్‌ షోను రూ.70 వేలకు కొనుగోలు చేసి టికెట్ల విక్రయాలు చేపట్టారు. చిరంజీవి సినిమా మొదటి ఆట చూడాలన్న అభిమానుల ఉత్సుకతను సొమ్ము చేసుకునేందుకు అర్ధరాత్రి రెండు గంటలకే చిత్ర ప్రదర్శన ఉంటుందని చెప్పి టికెట్ల విక్రయాలు చేపట్టారు. టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీరా లోపలికి వెళ్లగా, చిరంజీవి చిత్రం బదులు వేరే డబ్బింగ్‌ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. దీంతో ఆగ్రహం చెందిన అభిమానులు ఆందోళనకు దిగారు.

దీంతో థియేటర్‌ నిర్వాహకులు ఆ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. చిరంజీవి చిత్ర ప్రదర్శనకు సంబంధించిన డిజిటల్‌ లాక్‌ చేరడం ఆలస్యమైందంటూ కాలం గడిపారు. తెల్లవారు జామున నాలుగున్నర వరకూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూశారు. ఈలోగా ఇతర ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శన ప్రారంభమైందని అక్కడి అభిమానులు, మిత్రులు సెల్‌ఫోన్‌ల ద్వారా సందేశాలివ్వడంతో ఇక్కడి అభిమానులు సహనం కోల్పోయి అదనపు కుర్చీలు, బల్లలు, ధియేటర్‌ తలుపులు, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా థియేటర్‌లో టపాసులు పేల్చుతూ, కుర్చీలను స్క్రీన్‌ పైకి విసురుతూ పూర్తిగా చించివేశారు. థియేటర్‌ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది థియేటర్‌ ధ్వంసం గురించి ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించగా, ఆయన సిబ్బందితో రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనతో రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ముస్లింలకు 12% రిజర్వేషన్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC