షార్ట్‌ఫిల్మ్ కోసం చంపేశాడు..!

లక్ష్మీప్రసాద్(ఫైల్)


 వీడిన బాలుడిహత్యకేసు మిస్టరీ నిందితుడూ మైనరే

 

కరీంనగర్ క్రైం : షార్ట్‌ఫిల్మ్ తీయాలని, ఖరీదైన బైక్ కొనుక్కోవాలనుకున్న ఓ బాలుడి కల మరో బాలుడికి ప్రాణాంతకమైంది. తనతోపాటు ఆడుకునే బాలుడిని కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తాయని భావించి... కిడ్నాప్ చేసిన ఇంకో బాలుడు అతడిని హత్య చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం బట్టబయలైంది. గత నెల 17న జిల్లా కేంద్రంలో అదృశ్యమై ఆపై హత్యకు గురైన బాలుడు లక్ష్మీప్రసాద్(7) కేసులో మిస్టరీ వీడింది. లక్ష్మీప్రసాద్ బంధువుల అబ్బాయే హత్య చేసినట్లుగా తేలింది. కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డ ప్రాంతానికి చెందిన ఒర్సు కుమారస్వామి కాంట్రాక్టర్. అతడికి ఇద్దరు కుమారులు అనిల్, లక్ష్మీప్రసాద్(7). లక్ష్మీప్రసాద్ వీరి ఇంటి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.



కుమారస్వామి గత నెల 17న శబరిమల వెళ్లగా అదేరోజు ఉదయం 11 ప్రాంతంలో లక్ష్మీప్రసాద్ కిడ్నాప్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భగత్‌నగర్‌లోని ఓ కాయిన్‌బాక్స్ నుంచి బాలుడి తల్లికి ఫోన్ చేసి ‘మీ కొడుకును కిడ్నాప్ చేశాం రూ.5 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాం’ అని బెదిరించారు. మరునాడు కుమారస్వామితోపాటు బంధువులు టూ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ హరిప్రసాద్, ఎస్సై దామోదర్‌రెడ్డి, ఏఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న క్రమంలో జనవరి 22న మానేరు డ్యాం వద్ద బైపాస్‌రోడ్డులో కుళ్లిపోయిన స్థితిలో లక్ష్మీప్రసాద్ మృతదేహం లభ్యమైంది. షర్ట్ ఆధారంగా గుర్తించారు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.





హత్య జరిగిన తీరిది

కుమారస్వామి బంధువు అయిన ఓ బాలుడు(17) వీరి కుటుంబంతో చనువుగా ఉంటూ పిల్లలతో ఆడుకుంటుండేవాడు. వీరి వద్ద బాగా డబ్బుండడం చూశాడు. గతంలో ఓసారి వీరింట్లో చోరీ చేయడంతో మందలించి వదిలేశారు. ఈ బాలుడికి షార్ట్‌ఫిల్మ్‌లు తీయాలని కల. తెలిసినవారితో ఎప్పుడూ షార్ట్‌ఫిల్మ్‌లు, ఖరీదైన బైక్‌ల గురించే మాట్లాడేవాడు. అందుకు చాలా డబ్బులు అవసరముండడంతో ఇతడి కన్ను లక్ష్మీప్రసాద్ కుటుంబంపై పడింది. చిన్నారిని అపహరిస్తే సులభంగా డబ్బు వస్తుందని భావించి జనవరి 17న ఉదయం ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటున్న లక్ష్మీప్రసాద్‌ను తన బైక్‌పై ఎక్కించుకుని వారి బంధువుల ఇంటికి వెళ్లాడు. లక్ష్మీప్రసాద్ ఆకలిగా ఉందనడంతో అన్నం తినిపించాడు. అక్కడనుంచి తాడు, ప్లాస్టర్ తీసుకుని లక్ష్మీప్రసాద్‌ను మానేరు డ్యాం బైపాస్‌రోడ్డులోని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. లక్ష్మీప్రసాద్ నోటికి ప్లాస్టర్ వేసేందుకు ప్రయత్నింగా అతడు బిగ్గరగా అరవడంతో గొంతు గట్టిగా నొక్కిపట్టాడు. దీంతో ఊపిరి ఆగిపోయినట్లయి స్పృహ కోల్పోయాడు.



అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. లక్ష్మీప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి వచ్చి కాయిన్‌బాక్స్ నుంచి మృతుడి తల్లికి ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని చెప్పాడు. ఇంటికి వచ్చి మళ్లీ... లక్ష్మీప్రసాద్ కనిపించడం లేదని తల్లిని ఆరా తీయడంతో అందరూ కలిసి బాలుడికోసం వెదికారు. పోలీసులు రంగంలోకి దిగడంతో మళ్లీ కాయిన్‌బాక్స్ వద్దకు వెళ్లేందుకు వీలుకాక భయపడిపోయాడు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టగా లక్ష్మీప్రసాద్‌తో రోజూ ఆడుకునే సదరు బాలుడిపై అనుమానం కలిగింది. అతడిని విచారించగా హత్య చేసినట్లు తేలింది. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు హాజరుపర్చినట్లు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top