చెలరేగిన దొంగలు

చెలరేగిన దొంగలు

జిల్లాలో దొంగలు చెలరేగారు. ఆదివారం రాత్రి చింతలపూడి మండలంలో  వరుస చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.లక్ష నగదు, వెండి, బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం అపహరణకు   గురయ్యాయి. ఏలూరులో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలోనూ దొంగలు పడ్డారు. బంగారం, వెండి వస్తువులు అపహరించారు. 

 

చింతలపూడి :  మండలంలోని రాఘవాపురం, పట్టాయిగూడెం గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున వరుస చోరీలు జరిగాయి. ఫలితంగా స్థానికులు హడలెత్తిపోయారు. రాఘవాపురం గ్రామంలోని చిన్నంశెట్టి సత్యన్నారాయణకు చెందిన ఎరువుల దుకాణంలో రూ. 8 వేలను దుండగులు దొంగిలించారు. అలాగే వీరభద్ర సన్స్‌ మద్యం దుకాణం వెనక తలుపులను గునపంతో పగలగొట్టి లోపలికి చొరబడి రూ. 30 వేల నగదు, మద్యం బాటిళ్లు పట్టుకుపోయారు. గ్రామంలోని వీఆర్‌ఓ ముత్యాలరావు ఇంటి ముందు పార్క్‌ చేసి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కూడా మాయం చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలోని మహమ్మద్‌ సుబాని ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.5 వేల నగదును అపహరించారు. గాదం కమలాకర్‌కు చెందిన కిరాణా, జనరల్‌ స్టోర్స్‌లో చొరబడి బీరువా తెరిచి వెండి మొలతాడు, చిల్లర నగదు తీసుకెళ్లారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ వరుస దొంగతనాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో పట్టాయిగూడెం గ్రామంలోనూ మూడిళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు విజృంభించారు. గ్రామానికి చెందిన శెట్టిపల్లి చక్రధరరావు, శెట్టిపల్లి పార్థసారథి, దున్నపనేని రఘురామ్‌ కుటుంబాలు గ్రామాంతరం వెళ్లాయని గ్రహించిన దుండగులు ఆ ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రఘురామ్‌ కుమార్‌ ఇంట్లో బీరువా తెరిచి ఐదు కాసుల బంగారు నగలు, రూ.53 వేల నగదును దొంగిలించుకుపోయారు. మిగిలిన ఇద్దరూ దూరాంతరం వెళ్లడంతో ఆ ఇళ్లలో ఏమేం చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. ఒకే రోజు రాత్రి రెండు గ్రామాల్లో వరుస చోరీలు జరగడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. చింతలపూడి ఏఎస్సై ఆలి, క్రైమ్‌ బ్రాంచ్‌ ఏఎస్సై ఎం.డి. మగ్బుల్, హెడ్‌ కానిస్టేబుల్‌ సోంబాబు ఘటనాస్థలాలను పరిశీలించారు. తలుపులు తెరవడానికి ఉనయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకుని, బాధితుల నుంచివివరాలను సేకరించారు. ఈ చోరీలన్నీ ఒకే ముఠా చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌ టీమ్‌లను రప్పిస్తున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

ఏలూరులో.. 

ఏలూరు అర్బన్‌ : ఏలూరులోనూ తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగలు పడ్డారు.  టూ టౌన్‌  ఎస్సై ఎస్‌.ఎస్‌.ఆర్‌.గంగాధర్‌ కథనం ప్రకారం.. స్థానిక 30వ డివిజన్‌ పత్తేబాద ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనందం మోహన కృష్ణారావు ఈ నెల 21న ఇంటికి తాళాలు వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భీమవరం వెళ్లారు. తిరిగి 22వ తేదీ రాత్రి  వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి పరిశీలించారు. బీరువా తెరిచి ఉంది. అందులోని సుమారు ఆరు కాసుల బంగారు బ్రాస్‌లెట్, ఒక  ఉంగరం, గొలుసు ఏడు తులాల విలువైన వెండిసామగ్రి కనిపించలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గంగాధర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top