11 మంది సర్పంచుల చెక్‌పవర్‌ రద్దు

ప్రభాకర్‌రావు

 

– లేఔట్ల అక్రమాలపై ఐదుగురు కార్యదర్శులపై విచారణ

– డీపీవో ప్రభాకర్‌రావు వెల్లడి

 బి.కొత్తకోట: జిల్లాలో గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు చేపడుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మంగళవారం బి.కొత్తకోటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిధుల వినియోగంపై రికార్డులు నిర్వహించని 11మంది సర్పంచుల చెక్‌పవర్‌ను రద్దు చేసామని చెప్పారు. సర్పంచులపై అందే ఫిర్యాదుల విషయంలో తక్షణం చర్యలుంటాయని చెప్పారు. జిల్లాలో లేఔట్లు వేసే వ్యాపారులు నిబంధనలు పాటించాలని, లేదంటే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. లేఔట్ల అక్రమాలపై ప్రమేయం వున్న ఆరోపణలతో పీలేరు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన ఐదుగురు పంచాయతీ కార్యదర్శులపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాది 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రూ.120కోట్ల అందుతాయని అంచనావేశామని, ఇందులో రూ.60కోట్లు సిమెంటు రోడ్లకు, మిగిలిన రూ.60కోట్లు పంచాయతీల అభివద్ధి పనులకు ఖర్చు చేయనున్నామని చెప్పారు. జిల్లాలో 1,363 పంచాయతీలుండగా భవనాలులేని 135 పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు రూ.20.25కోట్లు మంజూరైనట్టు చెప్పారు. ఒక్కో భవనానికి రూ.15లక్షలు మంజూరుకాగా అందులో 10శాతం పంచాయతీ భరిస్తుందని, మిగిలిన 90శాతం నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తారని చెప్పారు. పంచాయతీల్లోని వ్యర్థాల నిర్వహణ కోసం 65 డంపింగ్‌ యార్డులు మంజూరు కాగా అందులో 9 యార్డుల నిర్మాణం పూర్తి చేయగా 27 నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల విషయంలో కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు విషజర్వాలు వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు. దీనిపై అప్రమత్తమై కార్యదర్శులు వైద్య, ఆరోగ్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల సమన్వయంతో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top