ఏజెన్సీలో తనిఖీలే తనిఖీలు..

చర్లలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు - Sakshi

  • నేటి నుంచి, అమరవీరుల సంస్మరణ, వారోత్సవాలు

  • సరిహద్దుకు చేరుకుంటున్న ప్రత్యేక బలగాలు

  • ఆందోళనకు గురవుతున్న గిరిజనులు



  • చర్ల : ఆదివాసీ గూడేలు బిక్కుబిక్కుమంటున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు భారీ విధ్వంసాలకు పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలిస్తూ.. పెద్ద ఎత్తున తనిఖీలు, కూంబింగ్‌ ఆపరేషన్‌లు చేపడుతున్నారు. గురువారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలంటూ.. చర్ల, వెంకటాపురం మండలాల్లోని పలు ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాలు వెలసిన విషయం విదితమే. ఆయా ప్రాంతాల్లో మావోయిస్టులు మందుపాతరలు, ప్రెజర్‌ బాంబులను ఏర్పాటు చేసి ఇటు ప్రజానీకాన్ని.. అటు పోలీసు యంత్రాంగాన్ని భయాందోళనలకు గురి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. స్పెషల్‌ పార్టీ, సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్‌ బలగాలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తూ.. కూంబింగ్‌ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. సరిహద్దుకు ప్రత్యేక పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. దీంతో  ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్‌ ఆపరేషన్లతో తిప్పాపురం, కుర్నపల్లి, బోదనెల్లి, కురకట్‌పాడు, బక్కచింతలపాడు, పులిగుండాల, కొండెవాయి, ఉంజుపల్లి, కట్టుకాలువ, గౌరారం, కలిపాక తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు ఏ క్షణాన ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రహదారులలో మోహరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల గ్రామాలకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేస్తూ.. వచ్చిపోయే వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని.. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు ముందస్తుగా మాజీ మిలిటెంట్లు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top