పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తా

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తా - Sakshi

ఏలూరు సిటీ : జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో వెయ్యి పాఠశాలలను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, నిబంధనల మేరకు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లేకపోయినా, నాణ్యమైన విద్యాబోధన జరగకపోయినా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తానని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ ప్రగతితీరుపై ఆయన విద్యాశాఖ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. జిల్లాలో నాణ్యమైన విద్యావిధానాన్ని అమలు చేయడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తానే తప్ప తూతూమంత్రంగా చదువుల వల్ల ఉపయోగం లేదన్నారు. విద్యారంగానికి రూ.200 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నామన్నారు. సర్వశిక్షాభియాన్‌  అమల్లోకి వచ్చిన తరువాత పాఠశాలల స్వరూపమే మారిందని, పల్లెల్లో మంచి భవనం ఉందంటే అది పాఠశాల భవనమేనన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. విద్యాశాఖాధికారులు, టీచర్లు కచ్చితంగా బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సిందేనన్నారు. మధ్యాహ్న భోజన పథకం వంటకానికి గ్యాస్‌ ఉపయోగించాలన్నారు. 100 శాతం గ్యాస్‌ కనెక్షన్లు అందించామని ప్రతి ఇంటా గ్యాస్‌పై వంట చేస్తుంటే మధ్యాహ్న భోజన పథకానికి కట్టెలు ఉపయోగించడం ఏమిటని కలెక్టర్‌ ప్రశ్నించారు. మధ్యలో బడి మానేసిన 9,058 పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. 246 పరీక్షా సెంటర్లలో 2,519 పరీక్షా తరగతి గదుల్లో రూ.34 లక్షల ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఈవో ఆర్‌ఎస్‌.గంగాభవాని, సర్వశిక్షాభియాన్‌  పీడీ వి.బ్రహ్మానందరెడ్డి, ఎంఈవోలు పాల్గొన్నారు.   

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top