లాటరీ పేరుతో మోసం

లాటరీ పేరుతో మోసం


► రూ.20 వేల విలువైన వస్తువులు రూ.5 వేలకే  ఇస్తామంటూ నమ్మబలికిన ఆగంతకుడు

► పోస్టాఫీస్‌లో డబ్బులు కట్టి పార్శిల్‌ తీసుకున్న యువకుడు

► అందులో పని చేయని వాచీ ఉండటంతో నెవ్వెరపోయిన బాధితుడు

►సెల్‌ఫోన్‌ కాల్స్‌తో మోసపోతున్న అమాయకులు



గిద్దలూరు : సర్‌.. మీకు లాటరీ తగిలింది.. రూ.20 వేల విలువైన స్మార్ట్‌ ఫోన్, ఇంపోర్టెడ్‌ వాచీ, బూట్లు మొత్తం కలిపి రూ.5 వేలకే ఇస్తున్నాం.. మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.5 వేలు నగదు చెల్లించి పార్శిల్‌ తీసుకోవడమే తరువాయి.. అని ఫోన్‌ వస్తుంది. రూ.20 వేల విలువైన వస్తువులు ఇస్తామన్న వారు కనీసం రూ.10 వేల విలువైన వస్తువులు ఇవ్వకపోతారా.. అని కొందరు అమాయకులు నిలువునా మోసపోతున్నారు. మండలంలోని వెంకటాపురం తండాకు చెందిన రోలర్‌ ఆపరేటర్‌ కార్తీక్‌కు రెండు రోజుల క్రితం కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.


ఓ వ్యక్తి మాట్లాడుతూ తాను ఫలానా కంపెనీ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. లాటరీలో మీకు రూ.20 వేల విలువైన బహుమతులు వచ్చాయని నమ్మించాడు. నమ్మిన కార్తీక్‌ బహుమతులు ఎక్కడకు వచ్చి తీసుకోవాలని ప్రశ్నించాడు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు.. మీ గ్రామంలోని పోస్టాఫీస్‌కు వస్తాయని చెప్పాడు. ఎన్ని రోజులకు వస్తాయని కంపెనీ ప్రతినిధిని కోరగా ఆయన రేపే పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.5 వేలు డబ్బు చెల్లించి బహుమతుల బాక్సు తీసుకోవాలని చెప్పాడు. పని వదిలేసి మరీ పోస్టాఫీసుకు వెళ్లి రూ.5 వేలు చెల్లించిన కార్తీక్‌.. ఆ తర్వాత గిఫ్ట్‌ బాక్సు తీసుకున్నాడు.


బయటకు వచ్చి తెరవగా అందులో రూ.100ల విలువైన బూట్లు, పనిచేయని రీబక్‌ కంపెనీ వాచీ మాత్రమే ఉంది. ఎలాంటి బిల్లులు లేకుండానే ఫోన్‌లో అమాయకులను మోసం చేస్తున్నారు. కార్తీక్‌కు వచ్చిన ఫోన్‌ నంబర్‌ 93123 20099కు తిరిగి కాల్‌ చేస్తే తాము బూట్లు, రీబక్‌ వాచ్‌ ఇస్తామని మాత్రమే చెప్పామని బదులిచ్చారు. వాచీ పనిచేయడం లేదని, దాన్ని ఏం చేయాలని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని ఫోన్‌ పెట్టేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top