చాల్లే ఆపండి.. పార్టీ పరువు తీశారు

చాల్లే ఆపండి.. పార్టీ పరువు తీశారు - Sakshi


అసమ్మతి గ్రూపునకు చంద్రబాబు క్లాస్

శ్రీధర్‌ను మార్చే ప్రసక్తి లేదు

స్వరం మారుస్తున్న కార్పొరేటర్లు

 

విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి తుస్సుమంది. మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తూ అసమ్మతి వర్గం నడిపిన కథకు మహానాడు సాక్షిగా ఆ పార్టీ అధిష్టానం తెరదించింది. మీరు చేసిన అల్లరి వల్ల ఇప్పటికే పార్టీ పరువుపోయింది. మేయర్‌ను మార్చే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమ్మతి వర్గానికి క్లాస్ తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది.


చీటికిమాటికి గొడవలు పడితే జనంలో పల్చబడతామంటూ చీవాట్లు పెట్టినట్లు భోగట్టా.  తాజా పరిణామాల నేపథ్యంలో కోనేరు శ్రీధర్‌ను మార్చాలంటూ సంతకాలు చేసిన కార్పొరేటర్లు స్వరం మారుస్తున్నారు. ఏదో తెలియక సంతకం చేశాం. మేము మీకు వ్యతిరేకం కాదంటూ మేయర్‌కు సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం.

 

శ్రీధర్‌దే పై చేయి

మేయర్ చైర్ వార్‌లో శ్రీధర్‌దే పై చేయి అయింది. కౌన్సిల్‌లో 38 మంది సభ్యుల బలం టీడీపీకి ఉంది. వ్యూహాత్మకంగా పావులు కదిపిన అసమ్మతి వర్గం 23 మంది సంతకాలను సేకరించింది. ఒకదశలో శ్రీధర్ అవుట్ అన్న వాదనలు వినిపించాయి. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు, ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబుతో పాటు మరో 13 మంది మేయర్ పక్షాన నిలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం అసమ్మతి వర్గం కొమ్ము కాసింది.


ఈ క్రమంలో అసమ్మతి వర్గం నెలవారీ మామూళ్లు ఇస్తామంటూ కార్పొరేటర్లకు ఎర వేయడాన్ని మేయర్ క్యాష్ చేసుకున్నారు. అసమ్మతి గ్రూపు వ్యవహరిస్తున్న తీరువల్ల పార్టీ అల్లరైపోతుందంటూ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్ అధికారులు సైతం అసమ్మతి నేతల తీరుపై వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇవన్నీ శ్రీధర్‌కు కలిసొచ్చిన పరిణామాలు.

 

కొరవడిన ఐక్యత

శ్రీధర్‌ను గద్దె దించాలని ప్లాన్ చేసిన అసమ్మతి గ్రూపులో ఐక్యత కొరవడింది. మేయర్‌చైర్ కోసం పోటీపడ్డ ముగ్గురు కార్పొరేటర్లు తలోదారి అవ్వడంతో సంతకాలు చేసిన కార్పొరేటర్లు సైతం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు తగదాల కారణంగా విజయవాడలో మేయర్‌ను మారిస్తే ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు మార్పు కోరుకొనే అవకాశం ఉందని అధిష్టానం అంచనా కట్టినట్లు తెలుస్తోంది. మేయర్ చైర్ మార్చే అవకాశం లేదని తేల్చిన అధిష్టానం, డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లను ఇప్పట్లో మార్చమంటూ సంకేతాలు ఇచ్చినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం హుషారు కాగా,  అసమ్మతి గ్రూపు దిగాలు పడింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top