ఆత్మస్తుతి.. పరనింద

ఆత్మస్తుతి.. పరనింద - Sakshi


- మహానాడులో చంద్రబాబు ప్రసంగం తీరు

పదేళ్ల ప్రత్యేక హోదా హామీ ఊసే లేదు

- చేయని పనులన్నీ చేసేసినట్లు తనకు తానే సర్టిఫికెట్

రెండేళ్ల పాలనలోని  వైఫల్యాలను దాచుకునేందుకు విపక్ష నేత జగన్‌పై విమర్శలు

బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని వెల్లడి

 

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ మహానాడు ఆద్యంతం ఆత్మస్తుతి, పరనిందలకే పరిమితమైంది. రెండు గంటలకు పైగా సాగిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో  అబద్ధాలు గుప్పించారు. ఐదేళ్లు కాదు పదేళ్ల ప్రత్యేక హోదా సాధిస్తామంటూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోయినా, చేయని పనులన్నీ చేసేసినట్లు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. పోలవరం పురోగతి గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. రెండు గంటల ఉపన్యాసం ఆసాంతం స్వోత్కర్షలతో నిండిపోయింది.



తన రెండేళ్ల పాలనలోని వైఫల్యాలను దాచుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. చంద్రబాబు టాకింగ్ పాయింట్స్ కింద సుమారు 50 పేజీల ఉపన్యాసం ఆద్యంతం అబద్ధాలతోనే నిండిపోయింది. రవ్వంత చేసిన దానికి కొండంత చెప్పుకున్నారు. ఉదాహరణకు... రైతులకు షరతుల్లేకుండా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చేనాటికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి. దీనిపై 14 శాతం వడ్డీ చొప్పున ఈ ఆర్థిక సంవత్సరం వడ్డీ రూ. 36 వేల కోట్లు కలిపి రూ.1,23,612 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ కేవలం రూ.8,444 కోట్లు మాత్రమే ఇచ్చిన చంద్రబాబు.. మొత్తం రుణ మాఫీ చేసేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు.



తాను రేయనకా పగలనగా దేశ విదేశాలు తిరిగి, పెట్టుబడులను ఆహ్వానించి, ఉద్యోగావకాశాలను పెంచుతున్నానని ఘనంగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి... ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయని విషయం గుర్తుచేసుకోలేదు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన మహానాడులో ఆ దిశగా ఉపన్యసించకుండా.. అధినేత సొంత డబ్బా కొట్టుకోవడం, ఎలాంటి జంకూ లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంపై తెలుగుతమ్ముళ్లే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

 తిరుపతి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రారంభమైన మహానాడులో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాంటి వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రూ.8600 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు.



ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను అభివృద్ధి పరచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 20 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అర్హతగల పేదలకు ఈ ఏడాది వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లన్నీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని, అమరావతిలో 125 అడుగుల ఎత్తున్న బీఆర్ అంబేడ్కర్ విగ్ర హం ఏర్పాటు చేస్తామని, ఎర్రచందనం ఆదాయంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే నిర్వహించిన అనంతరం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే ఆలోచన ఉందన్నారు. ప్రజాహితం దృష్ట్యా అధికారం చాలా ముఖ్యమని, ఇకపై ఎన్నడూ టీడీపీ ఓడిపోకూడదని చెప్పారు. తుని విధ్వంసం ఘటనలో వైఎస్ జగన్ పాత్ర ఉందంటూ.. అంతగా విధ్వంసం చేసే తత్వం ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు లేదన్నారు. రాష్ట్రంలో హింస సృష్టించేది వైఎస్ కుటుంబమేనని, ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అలా చేస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.



 ఎన్టీఆర్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం..

 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మహానాడు ప్రాంగణంలోకి ప్రవేశించిన సీఎం చంద్రబాబునాయుడు తొలుత ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన త్రీడీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి.. మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులతో కలిసి మహానాడు వేదికపైకి చేరుకుని పార్టీ జెండాను ఎగుర వేశారు.



 నివేదిక పొగడ్తలమయం

 టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ వార్షిక నివేదికను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనాథ్ నివేదికను సమర్పిస్తూ.. టీడీపీ జెండాలను పీకేస్తామని పదేపదే బెదిరిస్తోన్న టీఆర్‌ఎస్‌కు తమ పార్టీ బలమేంటో త్వరలోనే తెలుస్తుందన్నారు.  



 తొలి రోజు ఆరు తీర్మానాలు

 మహానాడు తొలి రోజు శుక్రవారం ఆరు తీర్మానాలను ఆమోదించింది. వీటిపై  పార్టీ నాయకులు చర్చించి వాటిని ఆమోదించారు. వీటికి  సీఎం చంద్రబాబు తగిన సూచనలిచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top