కండిషనల్ బెయిల్‌పై చంద్రబాబు!

కండిషనల్ బెయిల్‌పై చంద్రబాబు! - Sakshi


♦ ధ్వజమెత్తిన అంబటి రాంబాబు

♦ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు

♦ వెంకయ్యనాయుడు మధ్యవర్తిత్వం... కేసీఆర్ షరతులు

♦ అందుకే మూడు నెలలుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదు

 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్ద కండిషనల్ బెయిల్ తీసుకుని 88 రోజుల తరువాత ఉమ్మడి రాజధానిలోని సచివాలయంలో అడుగుపెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడి ్డని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం లో స్వర సహితంగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ తరువాత హైదరాబాద్ వైపు చూడ్డం మానేశారన్నారు.



చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్‌కు రూ.25 కోట్లు, హెచ్ బ్లాక్‌కు రూ.10 కోట్లు, లేక్‌వ్యూ అతిథి గృహానికి (క్యాంపు కార్యాలయం) రూ. 10 కోట్లు... మొత్తం రూ. 45 కో ట్లు వ్యయం చేసి ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకుని 88 రోజుల పాటు ఇక్కడికి రాకుండా ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. విభజన బిల్లు ప్రకారం పదేళ్ల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నా ఇక్కడ ఉండరని ఏపీ ముఖ్యమంత్రి తరపున  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేసీఆర్ కు పూచీకత్తు ఇచ్చారని, ఆయన మధ్యవర్తిత్వంలోనే వీరిద్దరి మధ్య ఈ షరతు మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. ఈరోజు చంద్రబాబు సచివాలయానికి వచ్చారంటే అది కేసీఆర్ అనుమతితోనే అని ఎద్దేవా చేశారు. ఈ విధంగా కేసీఆర్ వద్ద  కండిషనల్ బెయిల్ తీసుకుని పాలిస్తున్న చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతిక హక్కుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.



 అంగన్‌వాడీలపై అణచివేత పాశవికం

 చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుం చి జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీ టీచర్లు చేస్తున్న ఆందోళనను పాశవికంగా అణచివేయడం దారుణమని అంబటి విమర్శించారు.   



 చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్నలు

   రాజకీయనేతలు పత్రికలు, టీవీ చానెళ్లు పెట్టకూడదని ధర్మ పన్నాలు వల్లిస్తున్న చంద్రబాబూ... మీ పార్టీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీవీ చానెల్‌ను నడపడం లేదా?   మీ కుమారుడు లోకేశ్ బాబుతో ‘స్టూడియో-ఎన్’లో పెట్టుబడులు పెట్టించి నిర్వహణ చేయించింది తెలియదనుకుంటున్నారా?   లోకేశ్ నిర్దేశకత్వంలో ఆ చానెల్ చూసేవాడే దిక్కులేకపోతే ఆ యాజమాన్యం ఆయన్ను బయటకు పంపించిన విషయం తెలియదా?   సైకిల్‌పై తిరిగే ఒక వ్యక్తి పత్రికలో వేల కోట్లు బినామీగా పెట్టుబడులు పెట్టి నడిపించడం లేదా?

   మీకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు చదవొద్దని, చానెళ్లను చూడద్దని చెప్పడానికి మీకేం హక్కుంది?

   మీకు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నారని ఎన్టీవీ ప్రసారాలను 13 జిల్లాల్లో నిలిపివేయించింది వాస్తవం కాదా?

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top