సీఎం సీరియస్‌లో మర్మమిదే!

సీఎం సీరియస్‌లో  మర్మమిదే! - Sakshi


మంత్రి ప్రత్తిపాటిపై  రహస్య నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు

నకిలీ విత్తనాలు, పురుగు మందులను అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు

సొంత నియోజకవర్గంలో   ఆయన  సతీమణి చక్రం తిప్పుతుందనే ఆరోపణలు


 

 

సాక్షి, అమరావతి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని వీడియోకాన్ఫరెన్స్‌లోవెల్లడించినట్లు టీడీపీ వర్గాలు  అంటున్నాయి. ఉద్యోగుల బదిలీల సమన్వయం సాకుతో మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలకు జిల్లా అడ్డగా మారినా అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నట్లు చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కాదని పుల్లారావు భార్యే చక్రం తిప్పుతుందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతు న్నాయి. ఏ పని చేయాలన్నా ఆమె అనుమతి తప్పనిసరని కార్యకర్తలు వాపోతున్నారు. మంత్రి పేరు చెప్పి కొందరు అనుచరులు అడ్డంగా దోచుకొంటున్నారని సొంత పార్టీ వారే ఆందోళన చెందుతున్నారు.





ఎమ్మెల్యేలతోనూ సఖ్యత నిల్..: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలతోనూ మంత్రి పుల్లారావుకి సఖ్యత కొరవడినట్లు సమాచారం. పలుచోట్ల ఆయనే ఎమ్మెల్యేల ప్రమేయం లేకుం డా కలుగజేసు కోవడం వల్లే సమస్యలు తలెత్తినట్లు చర్చ సాగుతోంది. గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఎక్కువైనట్లు తెలిసింది. మార్కెట్ యార్డు చెర్మైన్ పదవి విషయంలో మోదుగుల మాటను మంత్రి పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యహరించడంతోనే మార్కెట్ యార్డు చైర్మన్ భర్తీ ఆగిపోయినట్లు సమాచారం.

 

సీసీఐ కుంభకోణంలో ఆరోపణలు....

గత ఏడాది సీసీఐ కొనుగోళ్లలో రూ. 450 కోట్ల కుంభకోణం బహిర్గతమైంది. మార్కెటింగ్ ఉద్యోగులు 15 మంది పైనా సీబీఐ కోర్టు విశాఖపట్నంలో కేసులు దాఖలయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేసినా మంత్రి ప్రత్తిపాటి పట్టించుకోలేదు. ఫైలును తొక్కిపెట్టినట్లు అ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సీసీఐ కుంభకోణంలో అప్పట్లో మంత్రి పాత్రపై పలు ఆరోపణలు వినిపించాయి. వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీలు, ఎంపీఈఓల తదితర ఉద్యోగుల ప్రమోషన్లు ఏడాదిగా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బదిలీలకూ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై నిఘా వర్గాల నుంచి  సీఎంకు సమాచారం అందడం వల్లే పుల్లారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top