గవర్నర్‌తో చంద్రబాబు భేటీ


♦ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకంపై సీఎం వివరణ..

♦ మర్యాదపూర్వక భేటీయేనన్న సీఎం సన్నిహిత వర్గాలు

 

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి వైఎస్ చౌదరి(సుజనా) కూడా ఉన్నారు. కొద్దిసేపటి తరువాత సుజనా బయటకు రాగా గవర్నర్, చంద్రబాబు మాత్రమే ఏకాంతంగా సమావేశమయ్యారు. చాలాకాలం తరువాత గవర్నర్‌తో చంద్రబాబు భేటీ జరగడం విశేషం. రాష్ట్ర ఎన్నికలసంఘం కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిత్తరంజన్ బిశ్వాల్‌ను నియమించాలని చంద్రబాబు భావించారు. అయితే ఆయన నియామకానికి గవర్నర్ కార్యాలయం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బిశ్వాల్ నియామకానికి దారితీసిన పరిస్థితులను చంద్రబాబు తాజా భేటీ సందర్భంగా గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.



ఇదిలా ఉండగా గవర్నర్ సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఆశిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్పీ టక్కర్‌ను ఆ పదవిలో నియమించాలని దాదాపుగా నిర్ణయించిన చంద్రబాబు.. నిమ్మగడ్డను సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనర్‌గా నియమించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. అయితే ఈ భేటీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని, కేవలం మర్యాదపూర్వక భేటీ అని సీఎం సన్నిహితవర్గాలు చెప్పాయి.  



 ఫాంహౌస్‌లో చంద్రబాబు బస

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఇక్కడి ఫౌంహస్‌లో బసచేశారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ పరిధిలో ఉన్న తన ఫాంహౌస్‌లో రెండు రోజులపాటు ఆయన ఉండనున్నారు. ఈ రెండురోజులపాటు చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు అక్కడే గడపనున్నాయి.



 30న మంత్రివర్గ సమావేశం

 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనుంది. విజయవాడలో ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top