చంద్రబాబు మోసకారి

చంద్రబాబు మోసకారి - Sakshi


- హామీలను ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారు

-  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు   వైఎస్ జగన్ మండిపాటు

 

 సాక్షి, కడప: ‘‘ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారు. చివరకు దళితులను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్సీ కాలనీల్లో 50 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడంలోనూ అనేక మెలికలు పెడుతున్నారు. మీటర్ల కనెక్షన్లకు డబ్బులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని ప్రభుత్వం బెదిరింపు దోరణిలో వ్యవహరించడం దారు ణం’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలోని స్వగృహంలో ఉన్న ఆయనను మంగళవారం వల్లూరు మండలం పైడికాల్వ ఎస్సీ కాలనీ వాసులు కలిశారు. దళితులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంద ని, తమకు కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని జగన్‌కు ఫిర్యాదు చేశారు. దళిత కాలనీ లోని ఇళ్లకు మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోందని.. ఇది సరైంది కాదని జగన్ మండిపడ్డారు.   



 నిరుద్యోగ భృతి ఏమైంది?

 ‘‘ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటి. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది‘’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. పులివెందులకు చెందిన కొందరు నిరుద్యోగులు మంగళవారం జగన్‌ను కలిశారు.



ఇంటర్, ఇంజనీరింగ్‌లో 90 శాతం మార్కులు సాధించినా ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ...  ఎన్నికల ముందు హామీలిచ్చి, అవసరం తీరాక విస్మరించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ పులివెందుల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top