మళ్లీ మళ్లీ వాళ్ళే సీఎంలు అవుతున్నారు

మళ్లీ మళ్లీ వాళ్ళే సీఎంలు అవుతున్నారు - Sakshi


♦ మోదీ, నితీశ్ తదితరుల పేర్లు ప్రస్తావించిన చంద్రబాబు

♦ వీరిలో చాలామందికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేవని వ్యాఖ్య

♦ పార్టీ నేతలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగాఉండాలి

 

 సాక్షి, హైదరాబాద్:  నిత్యం ప్రజల్లో ఉండే తాను రెండు విడతలు సీఎం పదవికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, ప్రజలతో అంతగా సన్నిహిత సంబంధాలు నెరపనివారు మళ్లీ మళ్లీ సీఎంలు అవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (గతంలో గుజరాత్ సీఎంగాపనిచేశారు) నవీన్ పట్నాయక్ (ఒడిశా), నితీశ్‌కుమార్ (బీహార్), జయలలిత (తమిళనాడు), రమణ్‌సింగ్ (ఛత్తీస్‌గఢ్), శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)ల పేర్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీరిలో చాలామందికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేవన్నారు. సోమవారం నాటి కేబినెట్ భేటీ నుంచి అధికారులు నిష్ర్కమించిన తర్వాత.. మంగళవారం నుంచి జరిగే జనచైతన్య యాత్రలను విజయవంతం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేయటం తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయినవారి గురించి, ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకున్నా మూడు అంతకంటే ఎక్కువసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టినవారి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీకి పొరుగున  ఉన్న రాష్ట్రాల సీఎంలు ప్రజలను నేరుగా కలిసిన సందర్భాలు తక్కువన్నారు.



అయినప్పటికీ అక్కడి ప్రజలు వారిని గెలిపిస్తున్నారని, మన రాష్ట్రంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా ఓడిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫలితాలు ఎన్నిక, ఎన్నికకు భిన్నంగా ఉంటున్నాయని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు అయిదేళ్లకోమారు ప్రజా తీర్పును కోరాల్సిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉండాలని సూచించారు. సీనియర్లు పరిస్థితులకు అనుగుణంగా అందరితో కలసి మెలసి పనిచేయాలన్నారు. మంత్రులు  కుల సంఘాల సమావేశాలకు వెళ్లవద్దని  సూచించారు.



 ఏ పార్టీవారినైనా చేర్చుకోండి..

 పార్టీకి ఉపయోగపడతారనుకునే నేతలు ఏ పార్టీలో ఉన్నా చేర్చుకునే ప్రయత్నం చేయాలని బాబు చెప్పారు. త్వరలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలి వరద సహాయ పనుల్లో కొందరు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారని వ్యాఖ్యానించారు. మారిై టెమ్ బోర్డు చైర్మన్‌గా సీఎం ఉండాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. యనమల రామకృష్ణుడు, కె.అచ్చన్నాయుడు తదితరులు ఇది సరికాదని చెప్పటంతో ఈ పదవిని పార్టీ నేతకు కేటాయించాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటుచేసే నగరాభివృద్ధి సంస్థలకు సీఎం చైర్మన్‌గా ఉండాలా లేదా మరొకరిని నియమించాలా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. సీఎం అలాంటి చిన్న సంస్థలకు చైర్మన్‌గా ఉండటం సరికాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు సమర్థించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top