బాబు పాదయాత్ర రాజకీయం కోసం కాదా?

బాబు పాదయాత్ర రాజకీయం కోసం కాదా? - Sakshi


ఓడిపోయిన తర్వాత నాలాగ ఇంట్లో ఎందుకు కూర్చోలేదు

కుల రాజకీయాలు చేస్తున్నాననడం సరికాదు

ఆయనిచ్చిన హామీలు అడిగితే అంత కోపం ఎందుకో

సాఫ్ట్‌వేర్ బాబుకు డేటా తెప్పించుకోడానికి 9 నెలలా?

ఉపవాసాలు మాకు అలవాటే.. అతి చేయొద్దు

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం



కిర్లంపూడి:


కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు తాను గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తుంటే కుల రాజకీయాలు చేస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారని.. మరి ఆయన గతంలో పాదయాత్ర చేసింది రాజకీయం కోసం కాదా అని కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత తనలాగే ఇంట్లో కూర్చోకుండా అధికారం కోసం పాదయాత్ర ఎందుకు చేశారని నిలదీశారు. ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరిన సందర్భంగా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆయనిచ్చిన హామీలనే ప్రస్తావిస్తుంటే.. ఆయనకు కోపం ఎందుకు వస్తోందని అడిగారు. తామేమీ పాకిస్థాన్ బోర్డర్ దాటలేదని, అలాంటప్పుడు ఇంత భద్రత ఏర్పాటుచేయడం అవసరమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి గతంలో దీక్షలు చేయలేదా.. ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనలు చేయలేదా, ప్రభుత్వానికి అడ్డు తగల్లేదా.. అని ప్రశ్నించారు. తమ కులానికి మేలు చేస్తామని ఆయన చెప్పడం వల్లే రిజర్వేషన్లు కావాలని అడిగాం తప్ప.. తామేమీ కుల రాజకీయాలు చేయట్లేదని స్పష్టం చేశారు. అయినా తమది కర్వేపాకు వర్గమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో తమను ఉపయోగించుకుని ఆ తర్వాత పక్కకు తీసి పారేయడం అందరికీ అలవాటుగా మారిపోయిందని చెప్పారు.



ప్రతిపాదనలు వచ్చాయి..

ప్రభుత్వం తరఫున తన మిత్రుడు, టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కొన్ని ప్రతిపాదనలు చేశారని, వాటికి తాను కొన్ని సవరణలు చెప్పానని ముద్రగడ అన్నారు. ఆయన ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ల స్పందన ఏంటో చెబుతానన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలి, ఏడాదికి వెయ్యికోట్లు ఇవ్వాలని మరోసారి చెప్పారు. ఎన్నికల సమయంలో, దానికి ముందు టీడీపీ ఇచ్చిన హామీల మేరకే ఇప్పుడు అడుగుతున్నామని అన్నారు. ఇంతకుమించి చేయడానికి తగిన ఆర్థిక స్థోమత కూడా లేదని తెలిపారు. అయినా.. తమ జాతిలో నూటికి 90 మంది పేదవాళ్లే ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాపులు ఇప్పటికీ బీసీ స్టేటస్ అనుభవిస్తున్నారని.. ఇక్కడ మాత్రం తీసేశారని అన్నారు.



డబ్బా కొట్టుకుంటున్నారు

చంద్రబాబు ఇంతకుముందు తొమ్మిదేళ్ల పాలనలో కాపులకు ఏమైనా చేసి ఉంటే సరిపోయేదని.. అయినా ఆయన అది చేశాం, ఇది చేశామని డబ్బా కొట్టుకోవడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఏవీ అమలు కావట్లేదని ముద్రగడ అన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీవో చెత్తబుట్టలో ఉండాల్సిన కాగితం అంటున్నారని.. అది దొంగ జీవో అయితే మీరు మంచి జీవో ఇచ్చి తమ వాళ్లకు మేలు చేయాలని అడిగారు.



సాఫ్ట్‌వేర్ బాబుకు డేటా సేకరణ కష్టమా

కాపుల స్థితిగతుల గురించి వేసిన జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు 9 నెలల గడువు ఇవ్వడంపై కూడా ముద్రగడ పద్మనాభం తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే చాలా డేటా ఉందని, 2011లో చేసిన సామాజిక సర్వేలో కులాలు, ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయని.. ఒక్క బటన్ నొక్కితే అందరి జాతకాలు బయటకు వస్తాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఉపయోగించేవాళ్లలో నెంబర్ వన్ తానేనని చెప్పుకొనే ముఖ్యమంత్రికి డేటా తీసుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన అన్నారు. తన పార్టీ పరిస్థితి గురించి ప్రైవేటు ఏజెన్సీలతో సమాచారం తెప్పించుకునే బాబు.. ఈ విషయంలోనూ అలా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని, ఆ విధంగా కూడా డేటా కలెక్ట్ చేసుకోవచ్చని, ఇన్ని మార్గాలు పెట్టుకుని మంజునాథ్ కమిషన్‌కు తొమ్మిది నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.



ఉపవాసాలు అలవాటే.. డాక్టర్లూ అతి చేయొద్దు

తనకు, తన భార్యకు రోజుల తరబడి ఉపవాసాలు చేయడం ముందు నుంచి అలవాటేనని, అందువల్ల మరికొన్నాళ్లు దీక్ష చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముద్రగడ చెప్పారు. తాను, తన భార్య కూడా నాలుగేసి రోజులు కేవలం టీ తాగి గడిపేసిన రోజులు చాలా ఉన్నాయన్నారు. సీఎం, పోలీసులు ఇచ్చినా ఆదేశం ప్రకారం తన ఆరోగ్యం నిలకడగా లేదని వైద్యులు చెప్పిస్తున్నారని అనుకుంటున్నానని.. డాక్టర్లు అతి చేసి ఉద్యమస్ఫూర్తిని దెబ్బ తీయొద్దని చెప్పారు. అనవసరంగా తమ దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సెలైన్ పెడితే దీక్ష విరమించేస్తానని అపోహలు సృష్టిస్తారేమో.. అయినా కూడా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top