ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు - Sakshi


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి





షాబాద్‌(చేవెళ్ల): కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని.. ఆత్మగౌరవ పాలన అంటున్న తెలంగాణలో దళితుల ఆత్మగౌరవ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం ఆయన ప్రభుత్వానికి సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. షాబాద్‌ మండలం ఏట్ల ఎర్రవల్లిలో దళితులపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం షాబాద్‌లో దళితులS ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో ఆత్మగౌరవంగా బతకాలనే కేసీఆర్‌కు రాజధానికి కూత వేటుదూరంలో దళితులపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సాంకేతిక యుగంలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నందుకు ప్రభుత్వాలు తలదించుకోవాలన్నారు. ఏట్లఎర్రవల్లి ఘటనపై ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.



విమలక్క ఆఫీసును మూసివేయడం, కోదండరాంను అరెస్టు చేయడం, ధర్నా చౌకును ఎత్తివేయడం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు. కానీ కేసీఆర్‌ ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని చాడ విమర్శించారు. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సామాజిక విప్లవకారులను గౌరవిస్తామని రాజ్యాంగంపై చేసిన కేసీఆర్‌ ప్రమాణాలు ఏమయ్యాయని  ప్రశ్నించారు. మనుధర్మ దోపిడీదారుల పాలనలో దళితులకు బతికే హక్కులేదా అని ప్రశ్నించారు. ఏం తినాలి, ఎలా బతకాలనే నిర్ణయం చేసే హక్కు మీకెవ్వరిచ్చారని ప్రశ్నించారు. గోమాంసాన్ని తినే హక్కు తమకుందన్నారు. కోర్టులు, పోలీసులు, ప్రభుత్వం ఒక్కటై దళిత, బహుజనులపై అణిచివేత కొనసాగిస్తున్నాయని, ఈ అణిచివేత ఎంతో కాలం కొనసాగదని విమలక్క అన్నారు. దళితులంతా ఏకమై కదలాల్సిన సమయం వచ్చిందన్నారు.



పోరాటాలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్‌ యజ్ఞాలు.. యాగాలు చేస్తున్నారని విమర్శించారు. ఏట్ల ఎర్రవల్లి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్‌ మాట్లాడుతూ హిందూ మతాన్ని సంస్కరించాలని , చదువు, సంపద, ఆస్తి అందరికీ దక్కాలన్నారు. సమ సమాజం రావాలన్న అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేయకుండా ఆయన భారీ విగ్రహాన్ని నిర్మిస్తామని దళిత, బహుజనులను కేసీఆర్‌ మభ్యపెడుతున్నారన్నారు.  అగ్రవర్ణాలకు మాత్రమే కేసీఆర్‌  ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కందుకూరు మండలంలో 5వేల మంది దళిత, గిరిజనుల భూములు లాక్కున్నారని,  కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఫార్మాసిటీ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములు కొని పెట్టుకున్నారన్నారు.



24గంటల్లోగా ఏట్ల ఎర్రవల్లి నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్యమం చేపడుతామని హేచ్చరించారు. ఓయూ జేఏసీ చైర్మన్‌ ధరువు ఎల్లన్న మాట్లాడుతూ కేసీఆర్‌ అండతోనే తెలంగాణలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఓయూలో ప్రశ్నించే గొంతుకలు ఉన్నందుకే కేసీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడకుండా వెళ్లిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య, టఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు భీంభరత్, తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ జోగు అశోక్‌కుమార్, ఎమ్మార్పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ, ఉపాధ్యక్షుడు వంకర్‌రావు మాదిగ, టఫ్‌ జిల్లా కార్యదర్శి నారాయణదాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, రైతుకూలీ పోరాటసమితి రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి,  ప్రొఫెసర్‌ ఖాసీం, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు విశ్వంమాదిగ, ఉపాధ్యక్షుడు భీంరాజ్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ మండల యువసేన అధ్యక్షుడు గూడూరు మõßహేష్‌మాదిగ, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు, నాయకులు బి.యాదయ్య, సాయన్న, అశోక్, వెంకటేష్, సామేల్, భానుచందర్, జంగయ్య, రాములు, కృష్ణయ్య, శ్రీను, ముక్కు లక్ష్మణ్, రాంచంద్రయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top