చైల్డ్‌ ఇన్ఫో మోడల్‌ జిల్లాగా ప్రకాశం


- బయోమెట్రిక్‌ ఏర్పాటు చేసేందుకు తొలి అడుగు

- ఆగస్టు మొదటివారంలోగా పూర్తిచేయాలని నిర్ణయం

ఒంగోలు: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చైల్డ్‌ ఇన్ఫోలో ఉన్న ప్రతి విద్యార్థికి వందశాతం ఆధార్, బయోమెట్రిక్‌ పూర్తిచేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాను మోడల్‌గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం చైల్డ్‌ ఇన్ఫోలో 4,77,598 మంది విద్యార్థులున్నారు. వీరిలో 2,41,102 మందికి ఐరిష్‌ ద్వారా మాత్రమే ఆధార్‌ మంజూరైంది. వారికి వేలిముద్రలు తీయలేదు. త్వరలో పాఠశాలల్లో బయోమెట్రిక్‌ను ప్రవేశపెడితే వీరి హాజరు వివరాలు కష్టసాధ్యంగా మారడం ఖాయం. అంతే కాకుండా ప్రైవేటులోను మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్న దశలో ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా వందశాతం ఆధార్, బయోమెట్రిక్‌ పూర్తిచేసేందుకు ఇటీవల ఏలూరులో విద్యాశాఖ అధికారులు, సర్వశిక్షా అభియాన్‌ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. అయితే మొత్తం ప్రక్రియను ఆధార్‌ చేసేందుకు, వేలిముద్రలు నమోదుచేసేందుకు ఎంత గడువు పడుతుందనేది కొంత సంశయంగా మారింది. దీనిపై 5 రోజుల్లో చేయగలమని ప్రకాశం జిల్లా సర్వశిక్షా అభియాన్‌ అధికారులు పేర్కొనడంతో ఈ మేరకు ప్రకాశం జిల్లాను మోడల్‌గా ఎంపికచేశారు. దీనివల్ల గతంలో ఐరిష్‌ ద్వారా ఆదార్‌ నమోదు చేసిన 2,41,102 మందికి వేలిముద్రలు నమోదు చేస్తారు. అంతే కాకుండా దాదాపు 40 వేలమంది ఆధార్‌లేని విద్యార్థులు కూడా పాఠశాలల్లో ఒకటి లేదా బడిమాని మధ్యలో చేరిన వారు ఉండి ఉంటారని అంచనావేస్తున్నారు. ఇవే కాకుండా 22 వేలమంది వరకు ఆధార్‌ అయితే నమోదుచేసుకున్న వారికి కార్డులు మాత్రం మంజూరు కాలేదు. దీంతో వారి యు.ఐ.డి. నెంబర్‌ ఆధారంగా వారికి కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. చైల్డ్‌ ఇన్ఫోలో వందశాతం నమోదు అయిన వారికి మాత్రమే 2 జతల యూనిఫారం, ఎన్‌టీ పుస్తకాలు, మధ్యాహ్నభోజనం, ఉపకార వేతనాలు మంజూరుకు అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకుగాను 229 ఆధార్‌కిట్‌లను ప్రకాశం జిల్లాకు రెండు రోజుల్లో పంపించనున్నారు. మండలానికి 4 లేదా 5 కిట్లను పాఠశాల సముదాయాల్లో ఏర్పాటుచేసి కార్యక్రమం పూర్తిచేయాలని భావిస్తున్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top