'దొరతనంతో ప్రజల గొంతునొక్కే యత్నం'


-ప్రాజెక్టుల విషయంలో స్పష్టంలేదు

-వచ్చేల నెల 3 నుండి 5 ప్రాజ్టెకుల పరిశీలన

-పారిశుధ్య కార్మికుని దగ్గర నుండి పూజరి వరకు సమ్మెలే

-కేసీఆర్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విమర్శ




ఖమ్మం : పోరాట నాయకుడినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే దొరతనంతో అందరి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలంటే కనీస గౌరవం లేదని, అసెంబ్లీ తొలి సమావేశాల్లో ప్రతిపక్షాలను కలుపుకుపోతూ, వారితో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోనని చెప్పిన కేసీఆర్ ఆ హామీని ఏనాడు నిలబెట్టుకోలేదన్నారు. జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా, ఆందోళన చేస్తే అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగ బద్ధంగా సమ్మె చేసిన మున్సిపల్ కార్మికులపై నిరంకుశ వైఖరి ప్రదర్శించి నియంతలా వ్యవహరించారన్నారు. ఆందోళన చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు ఉద్యమాలు కొత్తకాదని, అది తమ హక్కుఅని, ప్రజా ఉద్యమాలను కించ పరిస్తే కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.



పాత ప్రాజెక్టులకు పాతరేసే పనికి కేసీఆర్ ప్రభుత్వం స్వస్తి చెప్పాలన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల దగ్గర నుండి పూజరుల వరకు సమ్మెలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత వర్గాల దాక అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడితే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని, ఎవ్వరికీ ఏ సమస్యలు ఉండవని ప్రజలు భావించారని, అరుుతే ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ ప్రతిరోజు ఇందిరాపార్కు ఆందోళనలతో అట్టుడుకుతోందన్నారు.


తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న సీపీఐ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని వాడవాడలా నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ప్రాజెక్టుల పరిశీలన చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి నిధుల కేటాయింపుపై ఆందోళన చేపడతామన్నారు. కేసీఆర్ వైఖరితో తెలంగాణ ప్రజల్లో గతమే నయమన్న భావన పెరుగుతోందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top