సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు షాక్..

సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు షాక్..


 రూ. 1035 జరిమానా విధింపు

  సీసీ కెమేరాల ఆధారంగా గుర్తింపు

  వాహనదారుడి ఇంటికి వస్తున్న రశీదు


 

 తణుకు అర్బన్ :  నిబంధనలు పాటించకుండా వాహనాలతో రోడ్డెక్కితే.. జరిమానాల రూపంలో గుండెజల్లు మనిపిస్తున్నారు. వాహనం డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడితే మరీ నేరంగా పరిగణిస్తున్నారు. పోలీసులు విధించే జరిమానాతో నిజంగా మూర్చపోతారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఇటీవల పోలీసు అధికారులు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు.

 

 సాంకేతికతను వినియోగించుకుంటూ ఇప్పటికే తణుకు పట్టణంలోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిబంధనలు అతిక్రమించిన వారి వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. నంబరు బోర్డు ప్రకారం వారికి విధించిన జరిమానాలు ఇంటి అడ్రసుకు రశీదు రూపంలో పంపిస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ కానిస్టేబుళ్ల వద్ద ఉన్న కెమేరాల్లో చిక్కిన వాహనాలకు కూడా రశీదు ఇంటికి వెళ్తుంది. ముఖ్యంగా అత్యధిక జరిమాన సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు విధిస్తున్నారు.

 

 జరిమానాలు ఇలా..

 సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే వారికి ఇటీవల కాలంలో రూ.1035 జరిమానా విధించిన బిల్లు ఇంటికి చేరుతోంది. అందులో వారు సెల్‌ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వారి ఫొటోను సైతం పొందుపరుస్తున్నారు. దీంతో ఆ వాహనదారుడు గుండె గుభిల్లుమనడమే కాకుండా ఫోన్ వచ్చిన సందర్భంలో రోడ్డు పక్కన ఆగి మాట్లాడాల్సిందే అనే పశ్చాత్తాపం కూడా కలుగుతోంది.

 

  దీంతో పాటు నంబరు ప్లేటుపై రిజిస్ట్రేషన్ లేని బళ్లకు రూ.1000, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనాలకు రూ.500, నిబంధనలకు విరుద్దంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.335, నంబరు ప్లేటులో నిబంధనలు పాటించకపోతే రూ.100, హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.100 జరిమానాలు మన ఇంటి గుమ్మంలోకి పోస్టుమాన్ ద్వారా తలుపు తడుతున్నాయ్. దీంతో వాహనదారులు తమ వాహనాలను ఇతరులకు ఇవ్వాలన్నా సంశాయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. పై జరిమానాలన్నీ ఈ సేవా కేంద్రాల్లో చెల్లించే విధంగా నియమావళిని ఏర్పాటు చేశారు.

 

 నిబంధనలు మీరితే క్షమించం

 రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రకమైన జరిమానాలు విధిస్తున్నాం. ముఖ్యంగా వాహనం డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడడం క్షమించలేని పొరపాటు. వాహనచోదకుడితో పాటు రోడ్డుపై ప్రయాణించే వారిని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ఉంది. ఈ జరిమానాలు విధింపు మొదలయ్యాక కొంతమేర మార్పు వచ్చింది.

 

 -జీజే ప్రసాద్, తణుకు ట్రాఫిక్ ఎస్సై

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top