భద్రాద్రిపై ‘మాస్టర్’ కదలిక

భద్రాద్రిపై ‘మాస్టర్’ కదలిక


భద్రాద్రిని సందర్శించిన స్థపతి, సీఈ

విస్తరణపై నిర్వాసితులతో చర్చ

మరో పరిశీలన తర్వాత తుదిరూపు


 భద్రాచలం : భద్రాద్రి రామాలయ మాస్టర్ ప్లాన్‌పై కదలిక మొదలైంది. సీఎం కేసీఆర్ ఆలయాభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు, స్థపతి రామాలయాన్ని సోమవారం సందర్శించారు. దేవాదాయ శాఖ  స్థపతి వల్లీ నాయగన్, ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వరరావు ఆలయ ఉత్తర వైపు గోడ కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో ఉత్తర వైపున ఫుట్‌వే బ్రిడ్జి నిర్మించగా.. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. అయితే ఈ విషయాన్ని ఆలయాధికారులు వారి దృష్టికి తీసుకెళ్లారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో దీనిపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇక్కడి అధికారులకు తెలిపారు.


తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాటేజీ నిర్మాణానికి నిధులు కేటాయించిన నేపథ్యంలో వాటిని ఎక్కడ నిర్మించాలనే దానిపై కూడా స్థపతి, సీఈ పరిశీలన చేశారు. తానీషా కల్యాణ మండపం సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఆ ప్రదేశంలో కాటేజీలను ఏ మాదిరిగా నిర్మించాలనే విషయమై తగిన సూచనలు చేశారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100కోట్లు ప్రకటించిన నేపథ్యంలో సమగ్ర నివేదిక రూపొందించి.. ప్రభుత్వానికి అందజేసేందుకు భద్రాచలం వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఆలయాన్ని రెండుసార్లు పరిశీలించి, ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని, మరోసారి  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపు ఇస్తామన్నారు.


 మీ కోరికలు చెప్పండి..

మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా మాడ వీధుల విస్తరణ మరింత పటిష్టంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని స్థపతి వల్లీ నాయగన్, సీఈ వెంకటేశ్వరావు తెలిపారు. మాడ వీధుల విస్తరణకు గతంలోనే కొందరు ఆటంకం కల్పించగా.. ఇందులో ఆలయ అర్చకులు కూడా ఉన్నట్లు తెలుసుకున్న వారు.. దీనిపై వారితో చర్చించారు. ప్రభుత్వం మెరుగైన పునరావాస ప్యాకేజీ ఇస్తుందని, దేవస్థానం అభివృద్ధి దృష్ట్యా తమరు సహకరించాలని నిర్వాసితుల్లో ఒకరైన దేవస్థానం ప్రధానార్చకులు పొడిచేటి రామమ్‌తో అన్నారు. ‘అయ్యా మీ కోరికలు ఏమిటో చెప్పండి.. రమణాచారి మిమ్మల్ని స్వయంగా కలవమన్నారు.. మీరే ఇలా చేస్తే ఎలా అంటూ అర్చకులకు స్థపతి చేతులు జోడించి మరీ విన్నవించారు’. మాడ వీధుల విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఇళ్లను పరిశీలించి.. వాటి ఫొటోలను కూడా సేకరించారు. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారి వెంట ఈఓ రమేష్‌బాబు, డీఈ రవీందర్ తదితరులు ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top