నిండుకున్న నిధులు

నిండుకున్న నిధులు


బ్యాంకుల్లో క్యాష్ కొరత

  డిమాండ్ కొండంత... వచ్చింది ఇసుమంత

  రోజుకు కావాల్సింది రూ.175 కోట్లు... వచ్చింది రూ.82.34 కోట్లు

  తీరని చిన్ననోట్ల కొరత


విజయనగరం అర్బన్: డబ్బులు వస్తాయని రోజూ ఏటీఎంలు, బ్యాంక్‌ల చుట్టూతిరగడం... ఆపై రాలేదని తెలిసి వెనుతిరగడం... జిల్లాలో ప్రజలకు పరిపాటిగా మారింది. రెండురోజుల కిందటే ఆర్బీఐ హైదరాబాద్ నుంచి కావాల్సిన మొత్తం వస్తుందని ఊహించినా నేటికి ఫలితం లేదు. జిల్లాలో బ్యాంకుల నుంచి లావాదేవీల పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యం అవసరమైన డిమాండ్ కంటే దాదాపు 50 శాతం తక్కువగా నగదు అందుబాటులోకి వస్తోంది. దీంతో సామాన్య ప్రజానీకం సొమ్ముల కోసం కటకటలాడుతోంది.



జిల్లా వ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకులకు ఉన్న 289 శాఖల ద్వారా పెద్దనోట్లు రద్దుకాక ముందు రోజుకు సరాసరిన రూ. 225 కోట్ల లావాదేవీలు జరిగేవి. వీటిలో ఆన్‌లైన్,చెక్‌లు, డీడీల రూపంలో కేవలం రూ. 55 కోట్లు మాత్రమే జరిగేవి. మిగిలిన రూ.175 కోట్ల సొమ్ము ఆయాబ్యాంక్‌లు, వాటి ఏటీఎంలలో నగదు రూపంలో జరిగేవి.పెద్దనోట్ల రద్దుతో పరిస్థితి తారుమారుపెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పరిస్థితి దయనీయంగా మారింది. నగదు నిల్వలు సరిపడా లేకపోవడంతో బ్యాంకుల్లో నగదు ఉపసంహరణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. క్షేత్రస్థారుులో ఖాతాదారులకు నగదు మొత్తాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.



ఏటీఎంలలో,  బ్యాంక్ కార్యాలయంలో కూడా ఖాతాదారునికి అవసరానికి సరిపడా సొమ్ము అందటం లేదు. జిల్లాలో బ్యాంకుల వద్ద తగిన నిల్వలు లేకపోడం వల్ల ఖాతాదారులకు కొద్దిరోజులు ఇక్కట్లు తప్పేలా లేదు. బ్యాంకర్ల నివేదిక మేరకు శుక్రవారం ఉదయం నాటికి రూ. 82.34 కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధిక శాతం శాఖలున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)లకు జిల్లాలో ఏడు కేంద్రాల్లో నగదు పంపిణీ చేసే చెస్ట్ బ్యాంకులున్నారుు. మిగిలిన అన్ని బ్యాంక్‌లకు ఇతర జిల్లాల్లో ఉన్నారుు. బ్యాంక్‌ల్లో ఆన్‌లైన్, చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ల రూపంలోని లావాదేవీలు మినహారుుంచి కేవలం నగదులావాదేవీలే రూ. 175 వరకు అవసరమని గతంలో జరిగిన బ్యాంకింగ్ వ్యవస్థ చెబుతోంది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న రూ.82.34 కోట్లు ఈ ఒక్కరోజుకు కూడా సరిపోదు.



తీరని చిన్ననోట్ల కొరత

దీనికి తోడు చిన్న నోట్ల కొరత తీవ్రంగా పీడిస్తోంది. తాజాగా శుక్రవారం ఉన్న నిధుల నిల్వల్లో చిన్ననోట్లు అంతంత మాత్రంగానే ఉన్నారుు. రూ.100 నోట్లు తక్కువగా, రూ.2000 నోట్లు అధికంగా పంపుతున్నారు. బ్యాంకుల వద్ద రూ.5, రూ.10. రూ.20, రూ.50 కరెన్సీ నోట్లు ఉన్నా చెలామణిలోకి తేవడం లేదనే ఆరోపణలు ఉన్నారుు. రూ.2,000 నోట్లు ఎక్కువగా ఉండడం వల్ల వాటినే బ్యాంకర్లు విత్‌డ్రాకు వినియోగిస్తున్నారు. దీంతో పెద్ద నోట్లకు చిల్లర తెచ్చుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాజా నగదులో బ్యాంకర్ల విత్‌డ్రాకి ఇవ్వని రూ.50 నోట్లు 3.7లక్షలు, రూ.20 నోట్లు 6.4 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా తాజాగా ఉన్న నగదులో రూ.100 నోట్లు 12.21 లక్షలు, రూ.2,000 నోట్లు 3.2 లక్షలు ఉన్నారుు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top