అండకు దండ


2001 నుంచి కేసీఆర్‌తోనే కెప్టెన్ సాబ్

అన్ని సందర్భాల్లోనూ అధినేత వెన్నంటి నిలిచిన నేత

 

సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్‌ఎస్ ఆవిర్భావం (2001) నుంచి కీలక సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచిన మాజీ మంత్రి కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావు అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ అన్ని సందర్భాల్లో కేసీఆర్‌కు అండగా నిలిచారు. కేసీఆర్ సైతం కెప్టెన్ లక్ష్మీకాంతరావు విషయంలో తన సాన్నిహిత్యాన్ని బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.


కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ కెప్టెన్ ఇంటికి వెళ్లి లక్ష్మీకాంతరావు దంపతుల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీకాంతరావు నివాసం కేంద్రంగా కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీఆర్‌ఎస్ అధినేతగా ఉద్యమం నడిపిన రోజుల్లోనే కాకుండా... సీఎం పదవి చేపట్టాక కూడా కేసీఆర్ ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు.

 

రాజకీయ నేపథ్యం...

వడితెల లక్ష్మీకాంతరావు సొంత ఊరు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురం. ఆయన 1939 నవంబర్ 17న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాయంలో బీఎస్సీ పూర్తి చేశారు. ఓయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. 1963 నుంచి 1968 వరకు సైనిక శాఖలో సీనియర్ కమిషన్డ్ అధికారి (కెప్టెన్)గా పని చేశారు. 1983 నుంచి 1995 వరకు సింగాపురం సర్పంచ్‌గా పని చేశారు.


ఇదే గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో 14 నెలలపాటు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ కన్వీనర్‌గా ఎక్కువ రోజులు పని చేశారు. లక్ష్మీకాంతరావు కుమారుడు వి.సతీశ్ కుమార్ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

అనంతరం సతీశ్ కుమార్‌కు కేసీఆర్ పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇవ్వగా చట్టపరమైన వివాదం కారణంగా ఈ పదవులు రద్దయ్యాయి. లక్ష్మీకాంతరావు భార్య సరోజినిదేవీ సింగాపురం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచి హుజూరాబాద్ ఎంపీపీగా పనిచేస్తున్నారు. లక్ష్మీకాంతరావు సోదరుడు వడితెల రాజేశ్వరరావు సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.


1972 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్వరరావు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. లక్ష్మీకాంతరావు కుటుంబానికి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రాంటెక్ (మహారాష్ట్ర) జిల్లాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top