సింగపూర్ గుప్పెట్లో రాజధాని

సింగపూర్ గుప్పెట్లో రాజధాని


- స్విస్ చాలెంజ్ విధానంలో మెజారిటీ వాటా ఆ దేశ కంపెనీలకే

- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకే పెద్దపీట వేస్తూ రూపొందించిన స్విస్ చాలెంజ్ విధానానికి  ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భూముల బదలాయింపు, వాటాలతోపాటు ఆ దేశ కంపెనీలు విధించిన షరతులన్నింటికీ దాదాపు అంగీకరించింది. తొలి విడతగా సీడ్ రాజధానిలో ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు 50 ఎకరాలు, మొత్తంగా 1,691 ఎకరాలు సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాజెక్టులో మెజారిటీ వాటా, భూములివ్వడంతోపాటు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే సమకూర్చనున్నాయి.



శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం రాజధాని భూముల కేటాయింపుపై  నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మంత్రులు యనమల, నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఆమోదించిన స్విస్ చాలెంజ్‌ని సింగపూర్ కన్సార్టియం స్థాయిలో ఉన్న ఏ కంపెనీలైనా చాలెంజ్ చేసి తమ ప్రతిపాదనలు ఇవ్వొచ్చని, అంతే తప్ప రోడ్డుపైన పోయే కంపెనీలకు అవకాశం ఉండదన్నారు. 45 రోజుల గడువులోపు ఎవరూ చాలెంజ్ చేయకపోతే మళ్లీ వచ్చే మంత్రివర్గ  భేటీలో సింగపూర్ కన్సార్టియంకే ప్రాజెక్టు అప్పగించి పనులు మొదలుపెట్టిస్తామన్నారు.



 స్విస్ చాలెంజ్‌లో సింగపూర్‌కు...

 రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్-సిన్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ కంపెనీల కన్సార్టియం 2015 అక్టోబర్‌లో ప్రతిపాదనలు ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిపై చర్చించేందుకు హైపవర్ కమిటీని నియమించామని, పలు దఫాలు చర్చించాక స్విస్ చాలెంజ్ విధానం కింద వారి ప్రతిపాదనలను ఆమోదించామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ముందుకు రావాలని జపాన్, బ్రిటన్ దేశాలను కోరినా వారు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నారని తెలిపారు. దీంతో సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలపై ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు.



కన్సార్టియంగా ఏర్పడిన కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి 74.5 శాతం వాటా ఉందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం తరఫున ఈ కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీ (ఏడీసీ) (మొన్నటివరకూ సీసీడీఎంసీ)లు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఏడీసీకి 42 శాతం వాటా, సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం ఉంటుందని తెలిపారు. సీడ్ రాజధానిలో 1,691 ఎకరాలను ప్రభుత్వం ఏడీసీకి ఇస్తుందని, కంపెనీ తన భాగస్వామిగా ఉన్న సింగపూర్ కన్సార్టియంతో కలిసి దాన్ని అభివృద్ధి చేస్తుందని వివరించారు. తొలి విడతగా 50 ఎకరాలను ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు ఇస్తామని, రెండో విడతలో ఎకరం నాలుగు కోట్లు చొప్పున 200 ఎకరాలను ఇస్తామన్నారు. ఆ తర్వాత మార్కెట్ విలువను మూడో విడత మిగిలిన భూమిని వారికి అప్పగిస్తామన్నారు.

 

 వ్యతిరేకంగా వార్తలు రాసినా, చూపినా కేసులు పెట్టండి

 సాక్షి, హైదరాబాద్: తమకు వ్యతిరేకంగా పత్రికలు వార్తలు రాసినా, టీవీచానళ్లలో కథనాలు ప్రసారం చేసినా వారిని భయభ్రాంతులకు గురిచేసే రీతిలో కేసులు పెట్టాలనే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్టు, మంత్రులెవ్వరూ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కోరినట్టు తెలిసింది. ఇప్పటినుంచే భయపెట్టకపోతే ప్రతి విషయాన్నీ కొన్నిపత్రికలు, టీవీ చానళ్లు భూతద్దంలో చూపుతాయని, చిన్న తప్పుల్నీ ఎత్తిచూపే అవకాశముందని, ప్రజలకు అన్ని విషయాలు తెలిస్తే భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికే ప్రమాదకరంగా పరిణమించే వీలుందని కేబినెట్ భేటీలో సీఎం అన్నట్టు సమాచారం.

 

 ఉల్లంఘన జరగలేదు...

 రాజధాని నిర్మాణం ఒప్పందంలో ఎక్కడా చిన్న ఉల్లంఘన కూడా జరగలేదని సీఎం స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో సీఎస్ సంతకం పెట్టలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని... సీఆర్‌డీఏ చైర్మన్ హోదాలో మొదట ఈ ప్రతిపాదనలను తాను పరిశీలించానని, ఆ తర్వాత సీఎస్ నేతృత్వంలోని మౌలిక వసతుల కమిటీకి ఫైల్ పంపామని.. అక్కడి నుంచి సంబంధిత శాఖలకు వెళ్లి తిరిగి కేబినెట్‌లో మళ్లీ తన వద్దకొచ్చిందన్నారు. న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని నిబంధనల ప్రకారమే  చేశామని చెప్పారు. ప్రభుత్వం ఆమోదించిన స్విస్ చాలెంజ్‌ని సింగపూర్ కన్సార్టియం స్థాయిలో ఉన్న ఏ కంపెనీలైనా చాలెంజ్ చేసి తమ ప్రతిపాదనలు ఇవ్వొచ్చని, అంతే తప్ప రోడ్డుపైన పోయే కంపెనీలకు అవకాశం ఉండదన్నారు.



ఈ ప్రక్రియకు 45 రోజుల సమయం ఉంటుందని.. అప్పటికి ఎవరూ చాలెంజ్ చేయకపోతే మళ్లీ వచ్చే మంత్రివర్గ సమావేశంలో సింగపూర్ కన్సార్టియంకే ప్రాజెక్టు అప్పగించి పనులు మొదలుపెట్టిస్తామని తెలిపారు. సింగపూర్ కన్సార్టియం తరఫున మేనేజింగ్ కంపెనీని ఏర్పాటుచేసుకుంటారని, రాబోయే రోజుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటుచేసినా ఏడీసీ కిందే ఉంటాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రెవెన్యూ శాఖ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తుందని తెలిపారు. ఇరిగేషన్ పరిధిలోని కృష్ణానది కరకట్ట  పునర్నిర్మాణం బాధ్యత కూడా సింగపూర్ వాళ్లదేనన్నారు. మైనింగ్ శాఖ క్యూబిక్ మీటరు రూ.500 చొప్పున ఈ ప్రాజెక్టుకి ఇసుక సరఫరా చేస్తుందని, రవాణా శాఖ అవసరమైన రహదారుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, విద్యుత్ శాఖ విద్యుత్‌ను సరఫరా చేస్తుందని, ప్రజారోగ్యం, పారిశుధ్యం, భద్రత చర్యలతోపాటు ఇతర సౌకర్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలే చూస్తాయని ఆయన చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top