‘పేట’లో గంజాయి మాఫియా

‘పేట’లో గంజాయి మాఫియా - Sakshi

సూర్యాపేట

గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట ప్రాంతంలో విస్తరించిన ఈ మాఫియా.. చిన్నారులు మొదలు.. ఇంజినీరింగ్‌ విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. మత్తుకు అలవాటుపడుతున్న యువకులు›తల్లిదండ్రులను చితకబాదడం ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా మారుతోంది. విశాఖ, ఖమ్మం, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి వారితో సంబంధాలు ఏర్పరుచుకుని ఈదందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న యువతకు గంజాయిని అందిస్తూ జీవితాలు బుగ్గిచేస్తున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న బొడ్రాయి బజార్, పాత వ్యవసాయ మార్కెట్, రాజీవ్‌నగర్, ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల, ఇందిరమ్మ కాలనీల్లో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. కొంతమంది యువకులు మధ్యవర్తులుగా ఉండి విద్యార్థులు, యువతకు చేరవేస్తున్నట్లు సమాచారం. గతంలో టిప్పర్, బొలేరో వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. యువతకు గంజాయి అందిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు పెట్టినా ఈ దందా జోరుగా కొనసాగుతూనే ఉంది. 

ఇంజినీరింగ్‌ విద్యార్థులే లక్ష్యంగా..

ఇంజినీరింగ్‌ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి రవాణా కొనసాగుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రహరీని ఆనుకొని కొందరు వాహనాల్లో వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తుకు అలవాటుపడిన కొందరు విద్యార్థులు తమ జీవితాలను చిత్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బొడ్రాయిబజార్‌కు చెందిన కొందరు యువకులు కూడా గంజాయి రవాణాలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నంబరు ప్లేట్లు లేని కార్లను వినియోగిస్తూ.. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం. 

 డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం – వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశాం. నర్సాపూర్, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్‌ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. గంజాయి వాడుతూ దొరికిన విద్యార్థులకు కౌన్సిలింగ్‌ చేయం.. ఏకంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. గంజాయి రవాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టే పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. చెడు అలవాట్లను మాన్పించే బాధ్యత తల్లిదండ్రులదే.

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top