పుకార్లు..షికార్లు

పుకార్లు..షికార్లు - Sakshi

  • రూ.10 నాణేలు రద్దు చేసినట్లు ప్రచారం

  • దుకాణాలు, హోటళ్లలో నాణేలు తీసుకోని వైనం

  • బ్యాంకులకు క్యూకడుతున్న వ్యాపారులు

  • నెల్లూరు సిటీ : గతేడాది నవంబర్‌లో పెద్దనోట్లు రద్దు తరువాత ప్రధాని నరేంద్రమోదీ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పటి నుంచి రూ.100 కాగితం రద్దు చేస్తారని, కొత్త రూ.2000 నోటు మళ్లీ రద్దు చేస్తున్నారని, రూ.1000 నోటు కొత్తది ముద్రిస్తున్నారని ఇలా ప్రతిరోజూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే కొత్తగా రూ.10 నాణేలు ప్రభుత్వం రద్దు చేస్తుందని ప్రచారం సాగుతోంది.



    ఈ క్రమంలో అన్ని దుకాణాలు, హోటల్స్, భారీ షోరూమ్స్, సినిమా థియేటర్లలో రూ.10 నాణేలను ఆయా యాజమాన్యాలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. దీంతో ఇప్పటి వరకు తాము దాచుకున్న రూ.10 నాణేలను వ్యాపారులు, ప్రజలు బయటకుతీస్తున్నారు. దుకాణాల్లో మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టౌన్‌హౌస్‌పేటలోని ఓ బ్యాంకు సిబ్బంది రూ.10 నాణేలను తీసుకునేందుకు నిరాకరించారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం పుకార్లను నమ్మవద్దని చెబుతున్నారు.



    బాబోయ్‌..నకిలీ నాణేలు   

    చిల్లకూరు : నోట్ల నకిలీలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఇప్పుడు రూ.10 నాణేలు కూడా నకిలీలు రావడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వివరాలు..నాలు గు రోజుల క్రితం చిల్ల కూరుకు చెందిన ఓ చిరు వ్యాపారి తన వద్ద ఉన్న  రూ.10 నాణేలను బ్యాంకు లో డిపాజిట్‌ చేసేందుకు వెళ్లగా వాటిలో కొన్ని నాణేలు నకిలీవని అధికారులు పక్కన పెట్టారు. నకిలీ నాణేలను ఎలా గుర్తించాలని అడగడంతో వాటికి ఉన్న తేడాలను తెలియజేసి నకిలీ నాణేలను వారే తీసేసుకున్నారు. ఇటీవల నకిలీ రూ.10 నాణేలు విచ్చలవిడిగా చెలామణి అవుతుండడంతో వాటిని తీసుకునేందుకు అటు వ్యాపారులు, ఇటు ప్రజలు ముందుకు రావడం లేదు. నకిలీ నాణేలను సులువుగానే గుర్తించవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నకిలీ నాణేనికి హిందీ అక్షరం(రూ) లేకుండానే 10 అంకె మాత్రమే ఉంటుందని, నాణేనికి మరో వైపున రెండు అడ్డ గీతలు ఉంటాయని చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top