నీళ్ల కోసం వచ్చి..

నీళ్ల కోసం వచ్చి.. - Sakshi


 అటవీశాఖ అధికారులు  వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు నీటి తొట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చి వాటి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఫొటోలను చూడండి. సీసీ కెమెరాల్లో ఓ తొట్టి వద్ద మూడు చిరుతలు నీటిని తాగుతూ కనిపిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చడం కోసం నల్లగొండ జిల్లా చందంపేట అటవీ పరిధిలో 20 నీటి తొట్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు సీసీ కెమెరాలను అమర్చారు. నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులను ఫుటేజీల ఆధారంగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ని చిరుతలు ఉన్నాయనే విషయాన్ని లెక్కగడుతున్నారు. చందంపేట రేంజ్  పరిధిలో 15 వరకు చిరుతలు ఉన్నట్లు లెక్క తేలిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సర్వేశ్వర్ తెలిపారు.                               

- చందంపేట

 

బావిలో చిక్కి..

 కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట శివారులోని గుర్రాల ఆనందరెడ్డి అనే రైతు వ్యవసాయబావిలో నీళ్ల కోసం వచ్చి ఓ చిరుతపులి పిల్ల పడింది. మంగళవారం ఉదయం ఆనందరెడ్డి  గమనించి పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుమితారావు వచ్చి.. వరంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని రెస్క్యూ టీంకు సమాచారం అందించారు.



  వారు  క్రేన్ సహాయంతో బావిలోకి బోను దించినప్పటికీ చిరుత అందులోకి రాలేదు. దీంతో మత్తు మందు ఇచ్చి బయటకు తీశారు. వైద్యపరీక్షలు నిర్వహించి వరంగల్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం బావిలో పడి ఉంటుందని భావిస్తున్నారు. పెద్దలింగాపూర్, సోమారంపేట శివార్ల గుట్టల ప్రాంతంలో మరో మూడు చిరుత పులులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.  

- ఇల్లంతకుంట

 

ఎండకు కరిగి..





భగ్గుమంటున్న సూర్యుడి వేడికి రోడ్డుపై తారు కూడా కరుగుతోంది. ఏటూరునాగారం-తుపాకులగూడెం గ్రామాల మధ్యలోని బూటారం క్రాస్ రోడ్డు, రొయ్యూర్ సమీపంలో రోడ్డుపై తారు మంగళవారం ఇలా కరిగి కనిపించింది. ఈ రహదారిపై భారీగా లారీలు వెళ్తుండటంతో రోడ్డు కుంగిపోతోంది. విషయం తెలియక వచ్చిన ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.   

 - ఏటూరునాగారం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top