'రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం టీడీపీయే'

'రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం టీడీపీయే' - Sakshi


విభజన విషయంలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కు

ప్రత్యేక హోదాపై ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలి

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు


కోటగుమ్మం (రాజమండ్రి) : రాష్ట్రంలో ఉన్న సంపన్నులతో పాటు సింగపూర్, విదేశీ వ్యాపారులు, సంపన్నుల అభివృద్ధి కోసమే అమరావతి నిర్మాణం జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని టూరిస్టు నగరంగా మారుస్తున్నారని విమర్శించారు. ముందు కరువు జిల్లాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి - ప్రభుత్వ వ్యూహం’ అనే అంశంపై పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇక్కడి ఆనం రోటరీ హాలులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం టీడీపీయేనని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలు ప్రత్యేక హోదాపై గళమెత్తాలని డిమాండ్ చేశారు.



ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యాపార ఆలోచనలు తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన లేదన్నారు. ఏడాదిన్నర గడిచినా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక కాంట్రాక్టర్ భవనంలో కూర్చుని చంద్రబాబు రాజధాని జపం చేస్తున్నారు ఆక్షేపించారు. ఇప్పుడు మళ్లీ ఓడల రేవులంటున్నారని, రేవులొచ్చినా వాటిలోకి ఓడలు రావని ఎద్దేవా చేశారు. కార్మికులకు కనీస వేతనంగా రూ. 15 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పుష్కరాల్లో భారీ అవినీతి జరిగిందని, తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక కుభకోణం జరిగిందని ఆరోపించారు.


రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుక పూడిక తీతకు రూ.300 కోట్ల కేటాయింపులలో భారీ అవినీతి జరిగిందన్నారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన సొమ్మును ప్రజల నుంచి సేకరించి వారంతా జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు దువ్వా శేషుబాబ్జి, టి.అరుణ్, టీఎస్ ప్రకాష్, బీబీ నాయుడు, దళిత నాయకులు తాళ్ళూరి బాబూరాజేంద్రప్రసాద్, ఎస్.గన్నియ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top