బస్సెక్కితే బాదుడే


ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయాణికులపై ర(భ)క్షణాత్మక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రయాణికులపై చార్జీల భారం పెంచింది. సంస్థకు చెందిన స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లలో షాపులను అద్దెకు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రయాణికుల నుంచి మరింత వసూలు చేసేందుకు మరో కొత్త పన్నును తెరపైకి తెచ్చింది. అదే సేఫ్టీ ట్యాక్స్‌ (రక్షణ పన్ను). దూరంతో సంబంధం లేకుండా ప్రతి ప్రయాణికుడిపై రూపాయి చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. 

తెలుగు–వెలుగుకు మినహాయింపు

తెలుగు వెలుగు ప్రయాణికులకు మాత్రం సేఫ్టీ సెస్‌ పేరిట వసూలు చేసే రూపాయి నుంచి మినహాయింపు ఇవ్వడం కాస్తంత ఊరట. కాకపోతే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్‌ లగ్జరీ వంటి సర్వీసుల్లో ప్రయాణించే వారి ప్రయాణ చార్జీలోనే సేఫ్టీ సెస్‌ను కలిపి వసూలు చేస్తూ చీకటి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి వంటి ధనికులు ప్రయాణించే సర్వీసులకు సైతం సేఫ్టీ సెస్‌ నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. 

మధ్య తరగతి ప్రయాణికులపైనే భారం 

ఆర్టీసీలో సేఫ్టీ ట్యాక్స్‌ వసూలు ఈ ఏడాది జూలై 5వ తేదీ నుంచి మొదలైంది. పశ్చిమ రీజియన్‌ పరిధిలో 87 ఎక్స్‌ప్రెస్‌లు, 35 అల్ట్రా డీలక్స్‌లు, 77 సూపర్‌ లగ్జరీ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులకు ఈ సేఫ్టీ సెస్‌ భారంగా పరిణమించింది. తెలుగు–వెలుగు, ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారిపై సేఫ్టీ సెస్‌ మినహాయింపునిచ్చి కేవలం మధ్య తరగతి ప్రయాణికులపైనే ఈ భారం వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

విమానాల కంటే ఎక్కువ పన్ను : పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించుకునే  ఆర్టీసీపైనే పన్నుల భారం అధికంగా ఉంది. ధనికులు ప్రయాణించే విమాన ఇంధన ధరపై ఒక శాతం, రైళ్లకు వినియోగిస్తున్న ఇంధనంపై 4 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తుండగా, ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్‌పై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 27 శాతం పన్ను వసూలు చేస్తోంది. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ పన్నులో మినహాయింపు ఇవ్వకపోగా అత్యధిక పన్ను వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ప్రభుత్వం ఆర్టీసీ టికెట్లపై వచ్చే ఆదాయంపై 7 శాతం, బస్టాండ్ల ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా సంస్థకు వచ్చే ఆదాయంపై 14.5 శాతం పన్ను విధిస్తోంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top