నగదు రహితానికి బ్రేకులు

నగదు రహితానికి బ్రేకులు

- ఆర్టీసీలో ‘స్వైప్‌’ టికెట్లకు చిక్కులు

- ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భరం

- లావాదేవీల్లో జాప్యంతో కార్డులను తిరస్కరిస్తున్న ఆర్టీసీ

 

కర్నూలు (రాజ్‌విహార్‌):

 పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. ఆర్టీసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలులోని బస్‌స్టేషన్‌కు ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 24 గంటలు ప్రయాణికుల తాకిడి ఉన్న ఐదు బస్‌స్టేషన్లలో ఇదోకటి. ఈ బస్టాండ్‌ మీదుగా రోజుకు వెయ్యికి పైగా బస్సులు దూర ప్రాంతాలకు రాకపోకాలు సాగిస్తున్నాయి. 2003కు ముందు మ్యానువల్‌ (చేతి రాత పద్దతిలో) టికెట్లు ఇచ్చేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం కర్నూలులో 2003 మార్చిలో ఓపీఆర్‌ఎస్‌ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కర్నూలుతోపాటు మంత్రాలయం, శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లెలో రిజర్వేషన్‌ కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రతిరోజు హైదరాబాదుతోపాటు బెంగళూరు, తిరుపతి, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, వేలూరు తదితర దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు 500 మంది వరకు ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకుంటున్నారు. అయితే నగదు సమస్య కారణంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలకు ప్రజలు ముందుకు వస్తున్న సమయంలో ఆర్టీసీ టికెట్ల వద్ద నెలకొన్న సమస్యలు చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 ప్రయాణికులపై  స్వైప్‌ చార్జీల భారం

 స్వైపింగ్‌ ద్వారా ఆర్టీసీ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులపై భారం వేస్తోంది. టికెట్‌ ధరలపై ఒక శాతం మేరకు స్వైప్‌ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటోంది. స్వైప్‌ చేసే ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భారం వేసి ఖజానా నింపుకుంటోంది. ఇటు వివిధ రకాల బ్యాంకుల కార్డులను స్వైపింగ్‌కు వినియోగించడం ద్వారా ప్రయాణికుల ఖాతాల నుంచి టికెట్‌ సొమ్ము ఆర్టీసీ/ అధికృత ఏజెంట్ల ఖాతాలోకి వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోందనే కారణంతో కార్డుల స్వైపింగ్‌ను నిరాకరిస్తున్నారు. ‘స్వైప్‌ మిషన్‌ పనిచేయడం లేదు’ అని చెప్పి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ రెండు సమస్యలతో ఆర్టీసీలో నగదు రహితానికి బ్రేకులు పడుతున్నాయి. 

 

ప్రోత్సహించాలి : ఎస్‌. షేక్షావలి, శరీఫ్‌ నగర్‌

ఇటీవలే బెంగళూరు వెళ్లేందుకు టికెట్‌ రిజర్వు చేసుకునేందుకు ఏటీఎం కార్డును స్వైప్‌ చేశాను. అయితే టికెట్‌ ధర కంటే రూ.7 అదనంగా బ్యాలెన్స్‌లో కట్‌ అయింది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రయాణికులను ప్రోత్సహించకుండా భారం వేస్తే ఎలా.

 

మిషన్‌ పని చేయడం లేదన్నారు : ఉమేష్, కర్నూలు

చెన్నై వెళ్లేందుకు అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ కోసం వచ్చా. డెబిట్‌ కార్డు ఉన్న కారణంగా నగదు తీసుకురాలేదు. అయితే రిజర్వేషన్‌ కౌంటరులో ఉన్న స్వైపింగ్‌ మిషన్‌ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు మరోసారి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.

 

 లావాదేవీలకు సమయం పడుతోంది : పి. ప్రసాద్, ఏటీఎం, కర్నూలు బస్‌స్టేషన్‌.

కర్నూలు బస్‌స్టేషన్‌లో ఉన్న స్వైప్‌ మిషన్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధీకృత ఏజెంట్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉంది. ఈ బ్యాంకులు కాక ఇతర కార్డులు స్వైప్‌ చేస్తే ప్రయాణికుడి ఖాతా నుంచి ఏజెంట్‌కు వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోంది. డబ్బులు ఎక్కువగా కట్‌ అవుతున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పైఅధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top