పెళ్లి కొడుకు గొంతు కోసి..

పెళ్లి కొడుకు గొంతు కోసి..


దేవాలయం ప్రాంగణంలోనే వరుడి దారుణ హత్య

వధువు సోదరుడు, అతడి స్నేహితుల దాడి

అడ్డుకోబోయిన వరుడి తండ్రిపైనా దాడి

అమ్మాయిని తీసుకొని పరారైన కుటుంబీకులు

ప్రేమ పెళ్లిలో దారుణం

కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీలో కాలనీలో ఘటన


 

 కరీంనగర్ క్రైం/మానకొండూర్: పెళ్లి బట్టలపై రక్తం చిందింది! కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహం ఇష్టం లేని అమ్మాయి కుటుంబీకులు దేవాలయం ప్రాంగణంలోనే అతడిని గొంతు కోసి చంపేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ యువకుడిని కిరాతకంగా హతమార్చారు. అడ్డొచ్చిన వరుడి తండ్రిపైనా దాడికి పాల్పడ్డారు. సుమారు గంటపాటు రణరంగం సృష్టించి అమ్మాయిని తీసుకొని పరారయ్యారు. గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

 ఇద్దరూ ప్రేమించుకున్నారు..

 కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం విజయపురి కాలనీకి చెందిన మహంకాళి ఎల్లయ్యకు నలుగురు సంతానం. చిన్నవాడైన మహంకాళి అనిల్(24), అదే గ్రామానికి చెందిన అస్తపురం శ్రీనివాస్-తిరుమల దంపతుల కూతురు మౌనిక(19) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. ఏడాదిన్నర క్రితం ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయారు. అప్పుడు మౌనిక మైనర్ కావడంతో హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అరెస్టయిన తర్వాత అనిల్ చర్లపల్లి జైల్లో ఏడాదిపాటు శిక్ష అనుభవించిన కొద్దికాలం కిందటే బయటకొచ్చాడు. స్థానికంగా ఓ వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. మేజర్ అయిన మౌనిక ఇటీవల అనిల్ ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి అక్కడే ఉండిపోయింది. దీంతో మౌనిక కుటుంబ సభ్యులు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

 

 గుడిలోంచి లాక్కొచ్చి.. గొంతు కోసి..

 గురువారం మధ్యాహ్నం తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు అనిల్, మౌనిక చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అనిల్ తండ్రి ఎల్లయ్య, బంధువులు మల్లయ్య, రవితోపాటు కొందరు మహిళలు వచ్చారు. అనిల్, మౌనిక కొత్తబట్టలు ధరించి పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో మౌనిక సోదరుడు వంశీక్రిష్ణ ఉరఫ్ లడ్డు, అదే గ్రామానికి చెందిన టింకు, సాయిరాంతోపాటు సుమారు ఇరవై మంది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాహనాలపై అక్కడికి వచ్చారు. పెళ్లికి సిద్ధమైన అనిల్‌ను ఆలయంలో నుంచి ఈడ్చుకెళ్లారు.

 

  గుడి పక్కనే దారుణంగా రాడ్‌తో కొట్టారు. తర్వాత కత్తితో పొడిచి, గొంతు కోశారు. అడ్డుకోబోయిన అనిల్ తండ్రి ఎల్లయ్యపైనా రాడ్‌తో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు మౌనికను అక్కడనుంచి తీసుకొని పారిపోయూరు. స్థానికులు గమనించి ఎల్లయ్యను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మౌనిక సోదరుడు, అతడితో పాటు వచ్చినవారు సుమారు గంటసేపు రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఆలయం వద్ద రణరంగం సృష్టించారని స్థానికులు చెబుతున్నారు.

 

 రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ జె.రామారావు, సీఐలు వెంకటరమణ, విజయసారథి ఘటనా స్థలానికి చేరుకొని అనిల్ మృతదేహాన్ని పరిశీలించారు. హత్య ఎలా జరిగిందనే విషయూలను అనిల్ బంధువులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top