శ్రీశైలం టెయిల్‌పాండ్ డ్యాంకు గండి

శ్రీశైలం టెయిల్‌పాండ్ డ్యాంకు గండి


కోట్ల రూపాయలు కృష్ణార్పణం!



 మన్ననూర్: తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ఆధ్వర్యంలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీశైలం టెయిల్‌పాండ్ కాంక్రీట్ డ్యాంకు గండిపడింది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు అనుసంధానంగా మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం వజ్రాలమడుగు వద్ద పాతాళగంగ నుంచి సుమారు 16కి.మీ దూరంలో ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని 2003లో ప్రారంభించగా.. 12 ఏళ్లుగా కొనసాగుతోంది. కృష్ణానది బ్యాక్ వాటర్‌ను మళ్లించి జలవిద్యుదుత్పత్తిని చేసేందుకు ఈ టెయిల్‌పాండ్ డ్యాంను నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న డ్యాం శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో విద్యుదుత్పాదన కొనసాగుతుండటంతో కొద్దిపాటి ప్రవాహానికి నిర్మాణంలోని డ్యాం మధ్య భాగంలో సుమారు 30 అడుగుల వెడల్పు, ఎత్తులో కాంక్రీట్ కొట్టుకుపోయింది. ఈ కారణంగా నిల్వ నీరు దిగువకు పారుతోంది.



గురువారం రాత్రి 9 గంటల సమయంలో గండిపడినట్లు లింగాలగట్టు, పాతాళగంగ మత్స్యకారులు చెబుతున్నారు. మూడు నెలలుగా ఈ డ్యాంకు పగుళ్లు ఏర్పడినట్లు పేర్కొంటున్నారు. నీటిలో వేయాల్సిన ట్రీమి కాంక్రీట్‌లో నాణ్యత లోపించడం వల్లే గండిపడినట్లు ఇంజనీరింగ్ నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. అకస్మాత్తుగా కాంక్రీట్ డ్యాంకు గండిపడడంతో మత్స్యకారుల వలలు, బుట్టలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు డ్యాం దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడం ద్వారా చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జెఎన్‌కో ఉన్నతాధికారులు వజ్రాలమడుగుకు చేరుకునే అవకాశం ఉందని తెలిసింది. కాగా, టెయిల్‌పాండ్ డ్యాం నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నట్లు ప్రారంభం నుంచీ ఆరోపణలు రావడం గమనార్హం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top