స్వర్గధామానికి గ్రహణం

స్వర్గధామానికి గ్రహణం

  • రెండేళ్లు గడిచినా ప్రారంభం కాని పనులు

  • నేతల హామీలు గాలికి  

  • కావలి : కావలి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న ‘స్వర్గధామానికి’ రాజకీయ పార్టీల నేతల వాగ్ధాన భంగంతో గ్రహణం పట్టింది. దీంతో రెండున్నరేళ్లుగా స్వర్గధామం పనులు నిలిచిపోయాయి. కావలి పట్టణ ఉత్తర శివార్లలో ఒక ఎకరా 9 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని రోటరీ క్లబ్‌కు అప్పగించారు. ఆ స్థలంలో అంతిమ సంస్కారాలు చేసేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన నిర్మాణాలు చేయాలనేది రోటరీ క్లబ్‌ లక్ష్యం. ‘రోటరీ స్వర్గధామం ట్రస్ట్‌’ అనే సంస్థను రిజిస్టర్‌ చేసి దాని ద్వారా పట్టణంలో రూ.2 కోట్ల అంచనాతో నిర్మాణాలు చేయాలని భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో అస్థికల నిల్వ, ఉడ్‌ స్టోర్‌ తదితర ముఖ్యమైన భవనాన్ని రోటరీ క్లబ్‌ వారే స్వయంగా నిర్మించాలని నిర్ణయించారు. ఇక మిగిలిన వాటిని దాతల సహకారంతో  నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు.   



    ప్రకటనలతో సరి

    2014 నవంబర్‌ 4న ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ఈ స్వర్గధామంలో రూ.35 లక్షలతో దహనశాలను నిర్మించి ఇస్తానని ప్రకటించారు. పిండక్రతువుల హాలు నిర్మాణానికి రూ.5 లక్షల ఇస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇలా పలువురు పలు వాగ్ధానాలు చేశారు. కానీ ఒక్కరూ కూడా నయా పైసా కూడా విదల్చలేదు. దీంతో రోటరీ క్లబ్‌ వారు కావలిలో ప్రజల కోసం ‘స్వర్గధామం’ నిర్మిస్తున్నామని అద్భుతమైన కలర్‌ ఫుల్‌ బ్రోచర్‌ వేశారు.



    ఈ బ్రోచర్‌లోని స్వర్గధామం డిజైన్‌ పట్టణ ప్రజల కళ్లల్లో ఇప్పటికీ ఊగిసలాడుతూనే ఉంది. అయితే దాతృత్వం చేస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చిన నాయకులు వాటిని మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్న తీరు స్థానికుల్లో చర్చనీయాంశమైంది. కావలి ప్రజల కోసమే మా ఆశ, శ్వాస అంటూ ఊదరగొట్టే రాజకీయ నాయకులు ఈ స్వర్గధామం విషయాన్ని గుర్తు తెచ్చుకొని, వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top