ఆరిపోయిన ఇంటి దీపాలు

ఆరిపోయిన ఇంటి దీపాలు - Sakshi


గుంటూరు జిల్లాలో పండుగ పూట జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.  కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మునిగిపోగా...వాగును చూద్దామని వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదం బారిన పడ్డారు. అంతటా పండుగ కోలాహలం నిండిఉన్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో   విషాదాన్ని నింపాయి.  



ముగ్గురి ప్రాణం తీసిన ఇసుక గోతులు

కోనూరు (అచ్చంపేట) : అప్పటిదాకా కనుమ పండుగ వేడుకలు జరుపుకుని కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపిన ఆ ముగ్గుర్నీ అంతలోనే విధి పొట్టనపెట్టుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా నది సందర్శనకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాలేదు. నదిలో తీసిన గోతులు వారిప్రాణాలు తీశాయి. అచ్చంపేట మండలం కోనూరులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు...



కోనూరు గ్రామానికి చెందిన మత్సా మానవీంద్రనాథ్‌ (15), మత్సా కౌటిల్య (12), అజయ్‌  (20) మరో నలుగురు స్నేహితులతో కలిసి పండుగ పూట సరదాగా సమీపంలోని కృష్ణానదిని చూసేందుకు వెళ్లారు. వీరిలో మగపిల్లలంతా స్నానాలు చేద్దామని నదిలో దిగారు. నదిలో ఇసుక కోసం గోతులు తీయడంతో వీరు ప్రమాదానికి గురయ్యారు. ముందుగా కౌటిల్య మునిగిపోతుండగా  అతన్ని రక్షించేందుకు అజయ్, మానవీంద్రనా«థ్‌ ప్రయత్నించి వారు కూడా మునిగిపోయి గోతుల్లో కూరుకుపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు హాహాకారాలు చేయడంతో  సమీపంలో ఉన్నవారు గమనించి వచ్చి పడవ సాయంతో గాలించి గోతులలో కూరుకుపోయిన ముగ్గురి మృత దేహాలను వెలికి తీశారు. వీరితో పాటు నదిలోకి దిగిన  నాని, రుద్రదేవ్‌ ఒడ్డుకు సమీపంలోనే ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.



మృతులంతా ఒకే కుటుంబం వారు...

మృతిచెందిన మత్సా మానవీంద్ర  గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మత్సా కోటేశ్వరరావు కుమారుడు.    మానవీంద్రనాథ్‌  క్రోసూరు జైభారత్‌ హైస్కూలులో 10వ తరగతి చదువుతున్నాడు. మత్సా కోటేశ్వరరావు    తమ్ముడు శ్రీనివాసరావు కుమారుడు మత్సా కౌటిల్య. ఇతను అచ్చంపేటలోని బ్లూబెల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. అలాగే కోటేశ్వరరావు   చెల్లెలు భూలక్ష్మి కుమారుడు అజయ్‌.  ఇతను గుంటూరులో బీటెక్‌ సెకండియర్‌ చదువుతూ పండుగకు మేనమామ కోటేశ్వరరావు ఇంటికి వచ్చాడు.  కుమారులు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.  తమ కళ్లెదుటే ఆడుతూపాడుతూ తిరిగిన పిల్లలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్జీవంగా పడి ఉండటాన్ని తట్టుకోలేక  వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది.



మృతదేహాలను సందర్శించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

మృత దేహాలను మండల వైఎస్సార్‌సీపీ నాయకులు సందర్శించి కుటుంబ సభ్యులకు   సంతాపం తెలిపారు.  సందర్శించిన వారిలో మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్లు అంబటి నారాయణ, గంగసాని బాబు, జిల్లా పార్టీ సభ్యుడు పసుపులేటి శ్రీనివాసరావు, గ్రామపార్టీ కన్వీనర్‌ పాగిళ్ల శ్రీనివాసరావు, ఎస్‌సెల్‌ మాజీ కన్వీనర్‌ గుడేటి శ్యాంసన్‌ తదితరులు ఉన్నారు.



ఇరువురిని బలిగొన్న వాగు

మాచర్లరూరల్‌  :   లింగాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ కోలాహలం నెలకొంది... అయితే ఆ కుటుంబం  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం తల్లి వరికోతలకు వెళ్లగా.. తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులకు వెళ్లాడు. పండుగ, ఆదివారం కావటంతో వాగును చూద్దామని వెళ్లిన వారి పిల్లలు ఇద్దర్నీ వాగు మింగేసింది. మాచర్లరూరల్‌  మండలం  లింగాపురంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు...  గ్రామానికి చెందిన దొండా శివరామకృష్ణ (6), శివసాయి (5) వారి పిన్ని కూతురు ఝాన్సీతో కలిసి ఊరికి సమీపంలో ఉన్న చంద్రవంక వాగు వద్దకు వెళ్లారు.



వాగు ఒడ్డు వద్ద  ఆటలాడుతూ శివరామకృష్ణ, శివసాయి ప్రమాదవశాత్తూ వాగులోకి జారిపడ్డారు.  శివరామకృష్ణ ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో వాగులో ఉన్న రాళ్లల్లో కాళ్లు ఇరుక్కు పోవటంతో పూర్తిగా మునిగిపోయాడు. శివసాయి ఒడ్డు సమీపంలోనే లోతు ఉండటంతో పూడికలో కూరుకుపోయి ఊపిరాడక మృతిచెందాడు. వారితో   ఆటలాడుకునేందుకు వచ్చిన ఝాన్సీ నీటిలో నుంచి వారు ఎంతకీ బయటకు రాకపోవటంతో  ఊళ్లోకి వచ్చి బంధువులకు తెలిపింది.   గ్రామస్తులు గాలించగా   పది అడుగుల లోతులో నీరు ఉండటంతో చిన్నారులు గంట వరకు కనిపించలేదు. ముందుగా శివసాయిని తీసిన వారు రాళ్ల మధ్య ఇరుక్కొని కనిపించకుండా ఉన్న శివరామకృష్ణను బయటకు తీసేందుకు శ్రమపడ్డారు.



మిగిలిన కడుపుకోత

 తమ పిల్లలిద్దర్నీ అంజయ్య, రమణమ్మ దంపతులు  మాచర్లలోని ఓ ప్రైవైట్‌  స్కూల్లో యూకేజీ, ఎల్‌కేజీ చదివిస్తున్నారు. తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ రోజువారి కూలీ పనులకు వెళ్తున్నా తమలాగా పిల్లలు కష్టపడకూడదని ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు చెప్పించాలనుకున్నామని,   అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ చిన్నారులను విధి తమకు దూరం చేసిందని తల్లి రమణమ్మ  కన్నీరుమున్నీరుగా విలపించటం చూపరులను కలచివేసింది.   గ్రామం మొత్తం అంజయ్య, రమణమ్మల ఇంటి వద్దకు చేరి వారిని ఓదారుస్తూ నైతిక ధైర్యాన్ని అందించారు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్సై ఎం.రామాంజనేయులు గ్రామానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top