మాటేసి..దోచేసి

మాటేసి..దోచేసి - Sakshi


విజృంభిస్తున్న దొంగలు

హత్యలకు తెగబడుతున్న వైనం

మొక్కుబడిగా పోలీసు గస్తీ   




దొంగలు పెట్రేగిపోతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళితే చాలు.. తిరిగొచ్చేలోగా కొల్లగొట్టేస్తున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే అదను చూసి పుస్తెల గొలుసులు తెంపు కెళుతున్నారు. బంగారు ఆభరణాల కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. వాహనాల్లో పెట్రోలు మొదలు.. ఇంట్లోని బంగారు, ఇతర విలువైన వస్తువులను సైతం దోచేస్తున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపం దొంగలకు కలిసి వస్తోంది. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.



నెల్లూరు (క్రైమ్‌) : నెల్లూరు నగరంతో జిల్లాలో దొంగలు విజృంభిస్తున్నారు. జనం క్షణక్షణం అభద్రతా భావంతో గడిపే దుస్థితి నెలకొంది. ఇల్లు వదిలి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొందరు దేవుడిపై భారం వేసి దేవుడా నీవే దిక్కంటూ గడప దాటుతున్నారు. తాళం వేసి ఉంటే చాలు దుండగులు మాటేసి ఇల్లు లూటీ చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దుండగులు దోచుకెళ్లిపోతున్నారు. వీధుల్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను గుర్తించి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. మరికొన్ని చోట్ల దుండగులు పోలీసులమని భద్రత పేరుతో మహిళలు, వృద్ధులను అప్రమత్తం చేసి నగలు కాజేస్తున్నారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి వారిని హత్య చేసి అందిన కాడికి దోచుకెళుతున్నారు.



బైక్, ఆటో దొంగతనాలు సైతం అధికమయ్యాయి. ప్రస్తుతం దొంగతనాలే వృత్తిగా పెట్టుకున్న వారే కాకుండా జల్సాలకు అలవాటు పడిన యువకులు, విద్యార్థులు సైతం  దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ కేసులో నిమగ్నమై ఉండగానే మరో చోట దొంగతనాలకు పాల్పడుతూ నేరగాళ్లు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ప్రతి వేసవిలో చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న దృష్ట్యా దొంగతనాలు మరిన్ని జరిగే అవకాశం ఉండటంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  



ఆర్భాటపు ప్రకటనలే  

చోరీలపై సిబ్బందిని అప్రమత్తం చేసి, గస్తీ ముమ్మరం చేశామని పోలీసులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. పోలీసుల తీరు చూస్తే నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఏదైనా నేరం జరిగితే ఉన్నతాధికారుల మందలింపులు తప్పవన్న భయంతో నేరం జరిగిన వెంటనే హడావుడి చేస్తున్నారే తప్ప నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం, దొంగలను పట్టుకోలేక పోతున్నారు.  దొంగతనాల నియంత్రణకు ప్రతి స్టేషన్‌లో క్రైం పార్టీ సిబ్బంది ఉన్నారు. అధికారులు వీరిని స్వప్రయోజనాలకు వాడుకోవడంతో నేర నియంత్రణపై శ్రద్ధ కొరవడుతుంది. గస్తీ విధులు నిర్వహించే సిబ్బందికి దొంగల పట్ల సరైన అవగాహన లేకపోవడం, మొక్కుబడి విధులకే పరిమితమవుతున్నారు. నేర నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీఎస్‌ వ్యవస్థ నామమాత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు మూటగట్టుకుంటుంది.  



ఇటీవల సంఘటనలు  

► జనవరి 5న ఉస్మాన్‌సాహెబ్‌పేటో విశ్రాంత ఆరే ్జడీ సీతారామన్‌ను హత్యచేసి 15 సవర్లు దోచుకెళ్లారు.

► గతనెల 19న నర్తకిసెంటర్‌లో సూర్యతేజకు చెందిన అప్పీ ఆటో చోరీకి గురైంది.

► గత నెల 20న ఎన్‌టీఆర్‌నగర్‌లో వాసు ఇంట్లో దొంగలు పడి రూ.1.10 లక్షలు బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు.  

► గత నెల 27న పడారుపల్లి జాషువానగర్‌లో ప్రసాద్‌ ఇంట్లో దొంగలు పడి రూ. లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగలించారు.

► ఫిబ్రవరి 6న బాలాజీనగర్‌ పినాకిని అవెన్యూలో కె. గీతా కామాక్షికి  చెందిన కార్యాలయంలో  దొంగలు పడి రూ.50 వేలు విలువైన కంప్యూటర్లు ఇతర పరికరాలు దొంగలించారు.

► ఫిబ్రవరి 8న మూలాపేట కొండదిబ్బలో శ్రీనివాసులు ఇంట్లో దొంగలు పడి రూ.72 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచేశారు.

► ఈ నెల 13న ముత్యాలపాళెంలో కిరణ్‌కుమార్‌ ఇంట్లో దొంగలు పడి రూ.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలించారు.  

► ఈ నెల 13న చంద్రమౌళీనగర్‌లో జాన్‌శామ్యూల్‌ ఇంట్లో దొంగలు పడి రూ.75 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు.

► ఈ నెల 14వ తేదీన తల్పగిరికాలనీలో త్రివిక్రమ్‌నాయుడు ఇంట్లో దొంగలు పడి రూ.6.50 లక్షల సొత్తు అపహరించుకుని వెళ్లారు.

► ఈ నెల 15న ఆదిత్యానగర్‌లో జనార్దన్‌రెడ్డి ఇంట్లో రూ.లక్ష సొత్తును దొంగలించారు.

► తాజాగా ఆదివారం వనంతోపు సెంటర్‌లో వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగలు పడి 3 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించారు.



గస్తీ ముమ్మరం

దొంగతనాలను నియంత్రించేందుకు పగటి, రాత్రి గస్తీలు నిర్వహిస్తున్నాం. దీంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నంబరుకు లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లకు ఫిర్యాదు చేయండి.

– నగర డీఎస్పీ జి. వెంకటరాముడు 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top