కొత్త మేయర్ నేపథ్యం ఇదీ

కొత్త మేయర్ నేపథ్యం ఇదీ


హైదరాబాద్: గ్రేటర్ మేయర్‌గా పదవి చేపట్టిన బొంతు రామ్మోహన్ సాధారణ కుటుంబంలో జన్నించి అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్ జిల్లా కురవి మండలం నేరడకు చెందిన బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఏకైక కుమారుడు రామ్మోహన్. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆమనగల్‌లో చదువుకున్న ఆయన ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కురవి మండలం నేరడలో పూర్తి చేశారు. ఆ తర్వాత మానుకోటలోని కంకరబోడ్ హైస్కూల్‌లో 9వ తరగతి, ఎస్సెస్సీ, జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఇక జిల్లా కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ చదివిన రామ్మోహన్, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహం చేసుకున్న రామ్మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 

తొలుత ఏబీవీపీలో..

తొలుత ఏబీవీపీలో పనిచేసిన బొంతు రామ్మోహన్ 2002లో టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన క్రియాశీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నిక కాగా, పార్టీకి చేసిన సేవలను గుర్తించి మేయర్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ విషయం తెలియగానే అటు కురవి, ఇటు మానుకోట మండలాలతో పాటు జిల్లావ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, టీఆర్‌ఎస్ నాయకులు పలువురు రామ్మోహన్ ఎంపికపై హర్షించారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి మాట్లాడుతూ రామ్మోహన్‌తో కలిసి తాను ఉస్మానియాలో పీజీ చదువుకున్నానని గుర్తు చేశారు. చదువుకునే సమయంలో విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారని తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top