బోధన్‌ బంద్‌ ఉద్రిక్తం

బోధన్‌ బంద్‌ ఉద్రిక్తం - Sakshi


మాజీ మంత్రిపై కేసుకు నిరసనగా కాంగ్రెస్‌ బంద్‌ పిలుపు

దుకాణాలు బంద్‌ చేయాలన్న ఆ పార్టీ నేతలు

తెరవాలని టీఆర్‌ఎస్‌ నాయకుల ఒత్తిడి

ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం

పోటాపోటీగా ర్యాలీలు, పలువురి అరెస్టు  




బోధన్‌ టౌన్‌ (బోధన్‌): మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు పది మంది కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు సోమవారం తలపెట్టిన బోధన్‌ నియోజకవర్గ బంద్‌ ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌ నేతలు దుకాణాలు బంద్‌ చేయిస్తుండగా, టీఆర్‌ఎస్‌ నాయకులు నిలువరించే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం మొదలైంది. ఇరువురు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించడంతో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రిపై కేసు నమోదును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోమవారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి పాత బస్టాండ్, హెడ్‌ పోస్టాఫీసు, కొత్త బస్టాండ్, శక్కర్‌నగర్‌ చౌరస్తా మీదుగా ర్యాలీ నిర్వహించి దుకాణాలు బంద్‌ చేయాలని వ్యాపారస్తులకు సూచించా రు. శక్కర్‌నగర్‌ చౌరస్తాలో షాప్‌లు బంద్‌ చేయిస్తుండగా, అక్కడికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు నిలువరించే ప్రయత్నం చేశారు.



దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్త పరిస్థితి దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. అయితే, దకాణాలు బంద్‌ చేయిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నతేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలు దుకాణాలు బంద్‌ చేయిస్తూ అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకొన్నారు. అక్కడ ధర్నా చేసేందుకు యత్నిస్తుండగా, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు సురేందర్‌రెడ్డి, శ్రీనివాసులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని, కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. అంతే కాకుండా, పట్టణంలో అక్కడఅక్కడ బంద్‌ చేయిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ నాయకులనూ అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, టీఆర్‌ఎస్‌ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించి బంద్‌ చేయించిన షాప్‌లను తెరిపించే యత్నం చేశారు. శక్కర్‌నగర్‌ నగర్‌ చౌరస్తాలో హోటల్‌ తెరిచారని కాంగ్రెస్‌ నాయకులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకొని బంద్‌ చేయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అదే హోటల్‌ను తెరిపించి, లోనికి వెళ్లారు. వెళ్లి పోవాలని పోలీసులు ఎంత సముదాయించినా వినకుండా ఏసీపీతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌ వారిని అరెస్ట్‌ చేసి, ఠాణాకు తరలిస్తే మీరు ఇలా రోడ్లపైకి వచ్చి హంగామా చేయడం సరికాదని, వెళ్లిపోవాలని ఏసీపీ సూచించారు.



అయితే, టీఆర్‌ఎస్‌ నేతల తీరుపై కాంగ్రెస్‌ నేత గుణ ప్రసాద్, ఎంపీపీ గంగాశంకర్‌ మండిపడ్డారు. బంద్‌ నిర్వహించుకుంటే, అధికార పార్టీ వారు అడ్డు పడడం సరికాదన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ తీరును బోధన్‌ బల్దియా చైర్మన్‌ అనంపల్లి ఎల్లం తప్పుబట్టారు. బంద్‌ పిలుపు ఇవ్వడానికి కార ణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 32 మంది కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిప ల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆబీద్, కౌన్సిలర్లు దాము, పౌల్, రఫి, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్బగోని గంగాధర్‌గౌడ్, నాయకులు పాషామోయినొద్దిన్, ఇలియాస్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఆబీద్‌సోఫీ, కౌన్సిలర్లు ఎజాజ్, మీర్‌నజీర్‌ అలీ, శివాలయం కమిటీ చైర్మన్‌ పలావర్‌ సాయినాథ్, మారుతి మం దిరం చైర్మన్‌ గుమ్ముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top