కడపలోనూ బ్లాక్‌ మేనేజర్లు!


సాక్షి ప్రతినిధి, కడప: ప్రజానీకానికి చేరాల్సిన కరెన్సీ పక్కదారి పట్టింది. బ్లాక్‌ మనీ¯ని చెలామణి  చేసుకోవడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. ఉన్నతాధికారి సిఫార్సులకు కీలక అధికారి తలొగ్గారు. ఆనక బ్యాంకర్లపై ఒత్తిడి పెంచి క్యాష్‌ చేసుకున్న ఉదంతం జిల్లాలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని రూ.1000, రూ.500 పెద్దనోట్లు రద్దు చేయడం సామాన్యుల నుంచి ధనికుల వరకూ కుదిపేసింది. ఈ క్రమంలో అధికారులు సైతం బాధితులయ్యారు. అప్పటివరకూ పోగుచేసుకున్న ధనం ఒక్కమారుగా చెల్లుబాటు కాదని తేలడంతో, నగదు మార్పిడికోసం వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు బ్యాంకుల కీలక అధికారి ద్వారా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆమేరకు కరెన్సీ మార్పునకు సదరు కీలక అధికారి చీఫ్‌ మేనేజర్లపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ వ్యవహారం తొలిదశ కరెన్సీ సరఫరాలోనే సాగినట్లు తెలుస్తోంది. ఉన్నతస్థాయి అధికారి తర్వాత అదే పంథాను మరికొంతమంది అధికారులు అనుసరించినట్లు సమాచారం. ఇలా నూతన కరెన్సీ జిల్లాకు చేరిన ప్రతిమారు కొంతమొత్తం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా ఎంత మొత్తాన్ని పక్కదారి పట్టించారనే విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం.

బ్లాక్‌ బాబుల్లో సీబీఐ గుబులు

తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా బ్యాంకుల నుంచి నగదు పక్కదారి పట్టిందని వెలుగుచూడటంతో జిల్లాలో కొందరికి సీబీఐ గుబులు పట్టుకుంది. ధ్రువీకరణ జిరాక్స్‌ల ద్వారా నగదు పక్కాగా దారిమళ్లించిన వైనం వెలుగులోకి రానుందని తెలిసి వారిలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. కీలక అధికారి సిఫార్సులకు తలొగ్గి సర్దుబాటు చేస్తే చివరికి అది తమ మెడకు చుట్టుకుంటోందని కొందరు బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్లు మథనపడుతున్నారు. జిల్లాలోని కొందరు ఉన్నతాధికారులు బ్యాంకర్ల ద్వారా స్వయంగా నూతన కరెన్సీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన మొత్తం జిల్లాలో రూ.2,000 కోట్లు దాటినట్లు సమాచారం. ప్రతిరోజు దాదాపుగా రూ.100 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున డిపాజిట్లు ఖాతాదారులు, ప్రజానీకం స్వయంగా చేస్తున్నారా? నగదు పక్కదారి పట్టించి, బ్లాక్‌మనీదారులకు బ్యాంకర్లు అవకాశం కల్పిస్తున్నారా? అనే అంశాన్ని క్షుణ్ణంగా సీబీఐ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ’బ్లాక్‌ మేనేజర్లు’ జిల్లాలో కూడా ఉన్నట్లు వెల్లడికావడంతో సదరు సార్లు ఎలా తప్పించుకోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top