మళ్లీ కదలిక..

మళ్లీ కదలిక..


కాంట్రాక్టు కోసం బ్లాక్‌ లిస్టు సొసైటీల ప్రయత్నాలు

గతంలో పోస్టుకు రూ.లక్షన్నర వసూలుకు యత్నం

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

రిమ్స్‌లో 24 పోస్టుల కోసం సొసైటీల ఎంపికలో అధికారులు

చివరి జాబితాలో నలుగురు పోటాపోటీ


ఆదిలాబాద్‌:  జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో మంజూరైన ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల కోసం బ్లాక్‌ లిస్టు సొసైటీలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 24 పోస్టుల కాంట్రాక్టు కోసం గత ఫిబ్రవరిలో సొసైటీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంట్రాక్టు రాకముందే తమకే వచ్చిందంటూ ఆయా సొసైటీలు నిరుద్యోగులను మభ్యపెట్టి రూ.లక్షన్నర వసూలు చేసే ప్రయత్నాలు చేశాయి.



ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సొసైటీల ఎంపికను కలెక్టర్‌ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నామినేటెడ్‌ ద్వారా సొసైటీలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో మళ్లీ సదరు సొసైటీలు కాంట్రాక్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో బ్లాక్‌లిస్టులో ఉన్న సొసైటీలు సైతం ప్రజాప్రతినిధుల అండతో కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.  



నాలుగు సొసైటీల పరిశీలన..

ప్రస్తుతం రిమ్స్‌కు మంజూరైన 24 పోస్టుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న సొసైటీల నుంచి నాలుగింటిని ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల పరిశీలనలో అధికారులు తలమునకలై ఉన్నారు. తుది జాబితాలో ఉన్న సొసైటీల్లో సైతం బ్లాక్‌ లిస్టులో ఉన్న ఒక సొసైటీ ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రానికి ఈ చెందిన ఈ సొసైటీ గతంలో రిమ్స్‌ కాంట్రాక్టు కింద ఉద్యోగులను నియమించుకుంది.



సదరు సొసైటీ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో స్థానిక పోలీసుస్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం శాశ్వతంగా ఈ సొసైటీని బ్లాక్‌ లిస్టులో పెట్టింది. మిగతా మూడింటిలో వరంగల్, ఆసిఫాబాద్, హైదరాబాద్‌కు చెందిన సొసైటీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలోనూ ఒక కాంట్రాక్టర్‌ ఇతర జిల్లాల్లో బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నాలుగు సొసైటీల ఫైల్‌ ప్రస్తుతం జాయింట్‌ కలెక్టర్‌ వద్ద ఉంది. బ్లాక్‌ లిస్టులో ఉన్న సొసైటీని తీసివేయాలా.. వద్దా.. అనే తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

బ్లాక్‌ లిస్టులో..

గతంలో రిమ్స్‌లో కాంట్రాక్టు పొందిన ఈ సొసైటీలు నిర్వహణలో తప్పులు చేయడం, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ చెల్లించకపోవడం, తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని సొసైటీలను బ్లాక్‌లిస్టులో ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సొసైటీలు మళ్లీ కాంట్రాక్టు పొందే అవకాశాలు ఉండవు. గతంలో టెండర్లు వేసి 8 సొసైటీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ సొసైటీల్లో మూడు బ్లాక్‌లిస్టులోనే ఉన్నాయి.



ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సొసైటీల ఎంపిక ప్రక్రి య నిలిపివేశారు. మళ్లీ అవే పోస్టుల కోసం నాలుగు సొసైటీలు ప్రయత్నించడం, అందులో బ్లాక్‌లిస్టులో ఉ న్న సొసైటీలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ప్రజాప్రతినిధులతో సదరు సొసైటీలు తమకు అ వకాశం ఇవ్వాలంటూ పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీల ఎంపిక ప్రక్రియ కలెక్లర్‌ చేతుల్లో ఉండడంతో ఎంపిక ఎలా జరుగుతోందోనని ఆసక్తి నెలకొంది.



సాక్షి కథనంతో వెలుగులోకి...

గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాలను అమ్ముకుందామనుకున్న సొసైటీలు, వాటికి వత్తాసు పలికిన కొంతమంది అధికారుల బాగోతం అప్పట్లో ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి వచ్చింది. సొసైటీల ఎంపిక చేయకముందే అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం సంచలనం కలిగించింది. ఫిబ్రవరి 20న సొసైటీలు కొంతమంది అభ్యర్థులతో బేరసారాలు చేశారు.



తెల్లారితే తమకు కాంట్రాక్టు వస్తుందని, పోస్టు కావాలంటే రూ.లక్షన్నర ఇచ్చుకోవాలని మభ్యపెట్టారు. దీంతో ఇద్దరు అభ్యర్థులు మరుసటి రోజు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం కాగా, అదే రోజు ఆ సొసైటీల గుట్టు ‘సాక్షి’ బయటపెట్టడంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. అటు అధికారులు సైతం సొసైటీల టెండర్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం రిమ్స్‌లో కాంట్రాక్టు కోసం దరఖాస్తులు చేసుకున్న సొసైటీల అర్హతలు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయనున్నారు.



పరిశీలనలో ఉన్నాయి..

రిమ్స్‌లో పోస్టుల కోసం సొసైటీ ఎంపిక ప్రక్రియ పరిశీలన చేస్తున్నాం. నాలుగు సొసైటీలకు సంబంధించిన ఫైల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో బ్లాక్‌ సొసైటీలో ఉన్న సొసైటీపై ఇటీవలే మాకు ఫిర్యాదు వచ్చింది. సదరు సొసైటీని నోటీసులో ఉంచాం. పూర్తి వివరాలు తెలుసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

– కృష్ణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top