బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా యెండల?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా యెండల? - Sakshi


 పరిశీలనలో మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి పేర్లు

 

 సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత ఎన్నికలు నవంబర్‌లో పూర్తి కానుండడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకూ ఇప్పుడు ఎంపికచేసే వ్యక్తే అధ్యక్షుడిగా కొనసాగనుండడంతో సమర్థుడైన నాయకుని కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. రాష్ట్రంలో రాజ కీయ పరిస్థితులు, పార్టీ విస్తరించడానికి ఉన్న అవకాశాలు, వచ్చే ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేయడం వంటి అంశాలను దృష్టి పెట్టుకుని పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.



బీజేపీ నియమావళి ప్రకారం ఒకవ్యక్తం వరుసగా మూడుసార్లు అధ్యక్షుడిగా కొనసాగడానికి వీలు లేదు. దీంతో ఈసారి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఇది లా ఉండగా, బీజేపీ రాష్ట్ర కమిటీకి ఇప్పటిదాకా హైదరాబాద్‌కు చెందిన నాయకులే ఎక్కువగా అధ్యక్షత వహించారు. దీంతో రాష్ట్రకమిటీ జీహెచ్‌ఎంసీ కమిటీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈసారి హైదరాబాద్‌కు చెందిన వారు కాకుండా జిల్లాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే యోచనతో పార్టీ జాతీయ నాయకత్వం ఉంది. కేంద్రంలో ఉన్న జాతీయపార్టీగా కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పార్టీ విస్తరణకు, ఎదుగుదలకు అవకాశం ఉన్నా రాష్ట్రనేతల్లో అనైక్యత, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు ఏకపక్షంగా పనిచేయడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో పార్టీ బలపడడం లేదని ముఖ్యనేతలు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన జాతీయపార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న సానుకూలతను ఆసరాగా చేసుకుని పార్టీని విస్తరించే సామర్థ్యం ఉన్న నేత ఎవరనే దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.



 అయితే రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా సంఘ్‌పరివార్‌తో సంబంధాలు, సంఘ నేతల ఆశీస్సులు అన్నింటికంటే ప్రధానం అవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్టీ అగ్రనేతలు పి.మురళీధర్‌రావు, యెండల లక్ష్మీనారాయణ, నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రావు తదితరుల పేర్లపై చర్చ జరిగింది. జాతీయస్థాయిలో విస్తృతమైన సంబంధాలున్న తాను కేవలం 10 జిల్లాలకు పరిమితం కావడంపై మురళీధర్‌రావు ఈ పదవిని చేపట్టడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.



ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కన్నా వచ్చే ఎన్నికల్లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో బలమైన పట్టును సాధించుకోవాలనే ఆలోచనలో ఇంద్రసేనారెడ్డి ఉన్నట్టుగా సమాచారం. మిగిలిన నాయకుల్లో యెండల లక్ష్మీనారాయణ వైపు సంఘ పరివార్ రాష్ట్ర పరివార్ బాధ్యులు మొగ్గు చూపుతున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. పార్టీ సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు, బూత్, గ్రామస్థాయి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి.  రాష్ట్ర కమిటీ ఎన్నికలు నవంబరులో పూర్తయ్యే అవకాశాలున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top