మచ్చలేని పాలన బీజేపీ సొంతం


భీమవరం :  మచ్చలేని పాలన బీజేపీ సొంతమని, రెండేళ్ల పాలనను అవినీతి రహితంగా పూర్తి చేయడం తమ పార్టీ ఘనత అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన నిర్వహించిన వికాస్ పర్వ్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా అవినీతే ప్రధాన ధ్యేయంగా సాగిం దని విమర్శించారు.

 

 అందుకు భిన్నంగా నరేంద్రమోదీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ గుర్తింపు పొందిందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 28లక్షల మంది పార్టీ సభ్యులున్నారని చెప్పారు. విదేశాల్లో సైతం మన దేశం గౌరవ ప్రతిష్టలు పెంపొందించడానికి ప్రధాని మోదీ కృషిచేస్తుంటే, కొందరు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు.  

 

 ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.65 వేల కోట్లు  మంజూరు చేయగా, అందులో రూ.25 వేల కోట్లను కేవలం నూతన రాజధాని అమరావతికి కేటాయించారని వివరిం చారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాకుండా ఒక సిద్ధాంతం కోసం పని చేస్తోందన్నారు.

 

 నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ పార్టీ మనకేం చేసిందని కాకుండా, పార్టీకి మనమేం చేశామని ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. పార్టీ నాయకులు పీవీఎస్ వర్మ, డీఆర్‌కే రాజు, న రసింహారెడ్డి, కోడూరి లక్ష్మీనారాయణ, అల్లూరి సాయిదుర్గరాజు, కురెళ్ల నరసింహరావు, బూచి సురేంద్రనాథ్ బెనర్జీ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top