ఎగ్గొట్టడాల్లేవ్.. తప్పించుకోడాల్లేవ్..


 అధికారుల గుండెల్లో గుబులు

 జెడ్పీ, మండల పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ ఏర్పాటు

 నేటి నుంచే అమలు -అన్ని మండలాల్లో పరికరాల అమరిక




విజయనగరం: చుట్టపు చూపుగా నచ్చినప్పుడు కార్యాలయానికి రావడం..ఎక్కడికో ఫీల్డు మీదకి వెళ్లానంటూ సాకులు చెప్పి తప్పించుకవడానికి ఇక అధికారులకు కుదరదంటే కుదరదు. పలువురు మండలాధికారులు సమయానికి కార్యాలయాలకు రారనే అపప్రధ ఉంది. ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటలకు కార్యాయాలకు వచ్చే సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు, స్థానిక నాయకులు విజయ నగరం జిల్లా కేంద్రానికి వచ్చి  పలు ఫిర్యాదులు చేసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయినా అవేవీ అధికారుల్లో మార్పు తీసుకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేసుకుని మరీ విధులు నిర్వర్తించాల్సిందే! ప్రతి ఉద్యోగీ ఠంచన్‌గా ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కార్యాలయంలో ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.


జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఐరిస్ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గురువారం నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇటీవలే ఈ నూతన విధానం కోసం ఎన్‌ఐసీ కొటేషన్ల ద్వారా ఒక్కో బయోమెట్రిక్ మెషీన్‌ను రూ.7 వేలకు కొనుగోలు చేశారు. వాటిని జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లోనూ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇప్పటికే 24 మండలాల్లో బయోమెట్రిక్ మెషీన్ల అమరిక పూర్తయింది. అన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గురువారం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఉన్న ఎంపీడీఓనే కాదు సిబ్బంది అంతా కార్యాలయానికి తప్పనిసరిగా ప్రతిరోజూ రావాల్సిందే. కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్ సంతకం చేసి వెళ్లాల్సిందే. ఆ తరువాత అధికారుల అనుమతితోనే ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంది. కనుపాపలను గుర్తించే ఈ ఐరిస్ బయోమెట్రిక్ ద్వారా ప్రతిరోజూ హాజరు వేసుకున్నాకే విధులు నిర్వర్తించాల్సి ఉంది.   




అధికారులకు గండమే!

జిల్లాలోని పలువురు అధికారులు దాదాపు సగానికి పైగా విశాఖ పట్నంలోనే ఉంటున్నారు. ప్రతి రోజూ వివిధ రైళ్లు, బస్సులపై షటిల్ సర్వీసు చేస్తున్నారు. వీరికి ఇప్పుడీ ఐరిస్ బయోమెట్రిక్ వల్ల గండమే అని చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి జిల్లాలోని వివిధ మండలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బయోమెట్రిక్ అమలు లేని సమయంలో పన్నెండు గంటలకు వచ్చే సరికే ఆయా అధికారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఉదయం పదిన్నర గంటలకు కార్యాలయంలో హాజరు వేయాలంటే కష్టమేనని పలువురు అధికారులు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top