పేరుకే బయోమెట్రిక్‌

పేరుకే బయోమెట్రిక్‌ - Sakshi


శ్రీకాకుళం : రిమ్స్‌లో బయోమెట్రిక్‌ విధానం అమలు కావడం లేదు. దీన్ని అదనుగా తీసుకుని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తగా విశాఖపట్నం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది ఈ బయోమెట్రిక్‌ లేకపోవడంతో హాజరు పట్టీల్లో ఒకరి బదులు ఒకరు సంతకాలు చేస్తూ సమయపాలన పాటించడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా ఈ ఫోర్జరీ ప్రక్రియ జరుగుతోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే హాజరు పట్టీపై ఓ క్రాస్‌ మార్క్‌ వేసి వదిలేస్తున్నారని, ఇటీవల ఇలాంటి హాజరు పట్టీలు బయటపడ్డాయని కొందరు తెలిపారు.



అవినీతి ఆశలో..

రిమ్స్‌కి ఇటీవల కొంతమంది వివిధ ప్రాంతాలు, విశాఖపట్నం నుంచి కొత్తగా స్టాఫ్‌నర్సులు వచ్చారు. వారికి ఇక్కడకు రావడం ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల్లో వారిలో కొంతమంది విధులను ఎగ్గొంటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది తోటి సిబ్బందితో సంతకాలు చేయించడం, మరి కొంతమంది హాజరు విషయంలో సంబంధిత అధికారికి కొంత ముట్టజెప్పడం, ప్రలోభాలకు పాల్పడడం వంటివి జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా నర్సింగ్‌ గ్రేడ్‌-1 సూపరింటెండెంట్‌ అస్వస్థతకు గురికావడంతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న వారు ఈ హాజరును నిర్వహిస్తున్నారు. అక్కడే ఈ అవినీతి కోణం బయటపడినట్టు తెలుస్తోంది.



మూలకు చేరిన బయోమెట్రిక్

రిమ్స్‌లో బయోమెట్రిక్‌ విధానం మూలకు చేరింది. ఈ విధానం అక్కడ అమలులో ఉన్నా నామమాత్రంగానే నడుస్తోంది. కొత్తలో బాగానే నడిచినా రిమ్స్‌లో ఈ విధానం ఆధారంగా జీతాల చెల్లింపులు, ఇతర సెలవులు వంటివి పరిగణనలోకి తీసుకోకపోవడంతో చిక్కువచ్చిపడింది. దీన్ని అదనుగా తీసుకుని కొందరు ఇలా ఆటలాడుతున్నారు. రిమ్స్‌లో కొత్తగా వచ్చిన వారికి ఇంకా విధుల్లో డ్యూటీ చార్టులు తయారు కాలేదు. దీంతో దొంగ సంతకాలతో విధులకు డుమ్మా కొడుతున్నారు.



దీనిపై రిమ్స్‌ సూపరింటెండెంట్‌ సునీల్‌ నాయక్‌ వద్ద ప్రస్తావించగా వారం రోజుల్లో అన్నీ సరి చేస్తామని చెప్పారు. విధులకు రాని వారిని క్షమించబోమని తెలిపారు. డైరెక్టర్‌ రాగానే ఆమెతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. హజరు పట్టీలో దిద్దుబాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని, దీనికి కొంచెం సమయం పడుతుందని పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top