కొరియర్ బాయ్ స్వీట్ 80

కొరియర్ బాయ్ స్వీట్ 80


చాలామంది ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే ఏదో కోల్పోయామంటూ.. ఇప్పుడేం చేయాలంటూ దిగాలు పడి పోతారు. కానీ, కొంతమంది అందుకు భిన్నం. రిటైర్ అయ్యాక కూడా కొత్త లైఫ్ కోరుకుంటారు. నవ జీవనానికి బాటలు వేసుకుంటారు. వయస్సు మీద పడినా కర్తవ్యానికి వెన్ను చూపరు. ఈ కోవలోకే వస్తారు విజయవాడకు చెందిన భట్లపెనుమర్రు రాజన్న పంతులు గారు. ఈ 80ఏళ్ల నవ యువకుడు చేస్తున్న పనేంటంటే..

 

మీరు ఏదైనా కార్యక్రమం తలపెట్టారా... మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతోందా... ఎవరికైనా అర్జెంట్‌గా ఉత్తరం లేదా శుభలేఖ అందించాలనుకుంటున్నారా... లేదా విలువైన పత్రాలు ఎవరికైనా అందజేయాలనుకుంటున్నారా... అయితే, ఒక్కసారి పంతులు గారికి ఫోన్ కొట్టాల్సిందే. కార్యక్రమం ఏదైనా.. వాటి తాలూకా ఆహ్వాన పత్రాలు అందజేయడం ఈయన నిత్యకృత్యం. మండుటెండలో సైతం సైకిల్‌పై బయల్దేరి ఆహ్వానాలు అందజేస్తారు. ఆయన తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

 

నాకు ముగ్గురు పిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి సెటిల్ అయ్యారు. ఇప్పుడు నా వయసు ఎనిమిది పదులపైనే. నేను జీవిత భీమాలో పనిచేసి రిటైర్ అయ్యాను. సుమారు పాతికేళ్ల క్రితం 1992లో ‘జహన్ కొరియర్స్’ పేరున ఒక సంస్థను స్థాపించాను. ఇందులో ఉద్యోగులెవరూ ఉండరు.


ప్రొప్రయిటర్ నుంచి బంట్రోతు వరకూ అన్నీ నేనే. ఎవరైనా స్థానికంగా ఆహ్వాన పత్రాలు అందజేయాలంటే సహాయపడతాను. ఉదయం పది గంటలకు సైకిల్‌పై బయల్దేరుతాను. తిరిగి రాత్రి పది గంటలకు ఇల్లు చేరతాను. విలువైన సమయాన్ని వృథా చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నాకు చేతనైన పనిచేస్తున్నాను. నగరంలోని ప్రముఖుల పేర్లు ఎన్నో నా దగ్గర ఉన్నాయి. ఆ చిరునామాలను నిర్వాహకులకు చూపిస్తాను. వారికి అవసరమైన వారి పేర్లను వారు టిక్ చేస్తారు. కార్డుకు రూ.3 చొప్పున వసూలు చేస్తాను. కనీసం రూ.100 ఉండాలి. నా నంబరు 92467 46488.

 

ఏదైనా పనిచేయాలనే..

ఆహ్వాన పత్రాలు కొరియర్‌లో ఇవ్వాలంటే కార్డుకు కనీసం పదిహేను రూపాయలు వసూలు చేస్తారు. నేను కేవలం రూ.3 మాత్రమే వ సూలు చేస్తాను. రోజుకు సుమారు 100 కార్డులు బట్వాడా చేస్తాను. నేను కేవలం సైకిల్‌పై పనులు నిర్వర్తిస్తున్నాను. నా సేవలను గుర్తించిన స్థానిక సుమధుర సంస్థ నన్ను సత్కరించి కొత్త సైకిల్ బహూకరించింది. ఎండావానను లెక్కచేయను. ఏ పనీ చేయకపోతే నాకు తోచదు. ఇప్పుడు పెద్దవాడిని కావడం వల్ల రోజూ కార్డులు పంచే సంఖ్య తక్కువైంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top