భక్త జనసంద్రం

భక్త జనసంద్రం - Sakshi


గొబ్బియాలో.. గొబ్బియాలో.. సంక్రాంతి పండగొచ్చే గొబ్బియాలో.. సంబరాలు తీసుకొచ్చే గొబ్బియాలో అంటూ మహిళల పాటలతో.. చిన్నారుల సరదా ఆటలతో పవిత్ర పినాకినీ నదీతీరంలో గొబ్బెమ్మ(గౌరమ్మ)ల పండగ సోమవారం వైభవంగా జరిగింది. సంస్కృతి, సంప్రదాయాలతో ముంగిళ్ల ముందు రంగవల్లులతో తీర్చిదిద్దిన గొబ్బెమ్మలను ఊరేగింపుగా తీసుకొచ్చి  ‘ఏటిపండగ’ సందర్భంగా గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులతో పెన్నానదీ తీరం జనసంద్రంగా మారింది.



నెల్లూరు(బృందావనం): బాలబాలికలు గాలిపటాలను ఎగురవేస్తూ,  యువతీయువకుల కేరింతల కొడుతూ, మహిళల కోలాటాలు, టగ్‌ఆఫ్‌వార్,  తదితర ఆటపాటలతో రంగనాయకులపేటలోని పెన్నానదీతీరం హోరెత్తింది. భక్తులు వేలాదిగా తరలి రావడంతో జనసంద్రంగా మా రింది. నెల్లూరు పవిత్ర పెన్నానది తీరంలో ఏటా నిర్వహించే గొబ్బెమ్మల పండగ (ఏటిపండగ) సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కోలాహలంగా సాగింది. ధనుర్మాస ప్రారంభంలో తమ ఇళ్లలో ఉంచి పూజించిన గౌరమ్మలు(గొబ్బెమ్మ)లను భక్తిశ్రద్ధలు, దీపహారతులతో  పెన్నానదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ.  



ఎమ్మెల్యే అనిల్‌ పర్యవేక్షణ

విశేషంగా తరలివచ్చిన  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల్లూరు సిటీఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ వివిధ శాఖల అధికారులను సమన్వయపరుస్తూ భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఐదురోజుల క్రితమే ఎమ్మెల్యే అనిల్‌ దేవాదాయ, ధర్మాదాయ, విద్యుత్తు, పోలీసు, కార్పొరేషన్‌ తదితర శాఖలకు చెందిన అధికారు లను సమన్వయపరుస్తూ పలు పర్యాయాలు ఏర్పాట్లను పరిశీలించారు.



కొలువైన దేవతామూర్తులు

గొబ్బెమ్మల పండగను పురస్కరించుకుని దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్‌ వేగూరు రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో నగరంలోని, జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో శ్రీవిఘ్నేశ్వరుడు, నెల్లూరు గ్రామదేవత శ్రీఇరుకళల పరమేశ్వరి అమ్మవారు, శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి, శ్రీద్రౌపది సమేత శ్రీకృష్ణధర్మరాజస్వామి, మూలా పేట శ్రీభువనేశ్వరి సమేత శ్రీమూలస్థానేశ్వరస్వామి, జొన్నవాడ శ్రీకామాక్షీతాయి, నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాళు, శ్రీవేదగిరి లక్ష్మీనృసింహస్వామి, శ్రీమేలమరువత్తూర్‌ ఆదిపరాశక్తి అమ్మవారుతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులు కొలువుదీరారు. కొలువుదీరిన స్వామివార్లను వేలాదిగాభక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులు తీర్థప్రసాదాలు ఏర్పాటుచేశారు.



జనసంద్రం

పతంగులు ఎగురవేస్తూ చిన్నారులు, గొబ్బెమ్మలను నిమజ్జనం చేస్తూ మహిళలు, దేవతామూర్తులను దర్శిస్తూ భక్తులు.. ఆటపాటల్లో నిమగ్నమైన యువతీయువకులతో పవిత్ర పినాకినీ తీరం సోమవారం సాయం సంధ్యవేళ నుంచి జనసంద్రంగా మారింది.  



ఏటి పండగలో ప్రముఖులు   

నగరంలోని పెన్నానదితీరంలో నిర్వహించిన గొబ్బెమ్మల పండగలో రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌యాదవ్, మేయర్‌ అబ్దుల్‌అజీజ్, మాజీ ఎమ్మె ల్యే ముంగమూరుశ్రీధరకృష్ణారెడ్డి, వివిధపార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు.



సుఖసంతోషాలతో ఉండాలి : ఎంపీ మేకపాటి

నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులను నెల్లూరు పెన్నానది తీరంలో సంక్రాంతి సందర్భంగా కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించడం సంతోషదాయకమన్నారు. ఆ దేవతామూర్తుల దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో జీవించాలన్నారు.  



సంప్రదాయ పండగ : నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ గొబ్బెమ్మల పండగ చక్కటి సంప్రదాయపండగని పేర్కొన్నారు. భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు.



మహద్భాగ్యం : రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వదేవతలు నెల్లూరులో కొలువుదీరి ప్రజలకుదర్శనం కలిగించడం మహద్భాగ్యంగా పే ర్కొన్నారు. ప్రజలకు భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top