‘భగీరథ’ సైట్‌ ఇంజినీర్‌ దుర్మరణం


బాన్సువాడ:

రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బాన్సువాడ-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కేరళ రాష్ట్రంలోని కలికార్‌ పట్టణానికి చెందిన ఇంజినీర్‌ రతీష్‌ (31) మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా రెండేళ్ల క్రితం బాన్సువాడకు వచ్చాడు. సైట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డి రోడ్డుపై జరుగుతున్న పనులను పర్యవేక్షించి, రాత్రి తన బైక్‌పై బాన్సువాడకు బయల్దేరాడు. అదే సమయంలో నిజాంసాగర్‌ మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన శివరాజ్‌కుమార్, తుంకిపల్లికి చెందిన గొల్ల రాజులు బైక్‌పై బాన్సువాడ నుంచి వస్తున్నారు.



ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో రతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అరగంట వరకు రోడ్డు పైనే పడి ఉన్న ఆయన తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలొదిలాడు. శివరాజ్‌కుమార్, రాజు కూడా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో రతీష్‌ మృతదేహంతో పాటు క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గొల్ల రాజును వైద్యుల సూచన మేర నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, రతీష్‌ మృతి వార్త తెలుసుకొని ఆస్పత్రికి వచ్చిన మిషన్‌ భగీరథ సిబ్బంది.. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి సైట్‌ ఇంజినీర్‌ మృతికి కారకుడైన గొల్లరాజును తీసుకెళ్లొద్దని అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వీరిని సముదాయించి, అంబులెన్స్‌ను అక్కడి నుంచి పంపించారు. కేసు దర్యాప్తులో ఉంది.



108 సకాలంలో వస్తే..

ప్రమాదం జరిగిన అనంతరం సుమారు అరగంట పాటు రతీష్‌ ప్రాణాలతో ఉన్నాడని, తీవ్ర రక్తస్రావం కావడం వల్లే అతను మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 108కు సమాచారం అందించినా, సకాలంలో వారు రాలేదని, ఆటోలు, ఇతర వాహనాలు కూడా ఆగకుండా వెళ్లిపోయాయని, చివరకు అతను ప్రాణాలు వదిలాడని ఆవేదన చెందారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి సకాలంలో తరలిస్తే అతను బతికేవాడని చెప్పారు.



ఉద్యోగం కోసం వచ్చి.. మృత్యు ఒడికి..

కేరళలోని కలికార్‌ పట్టణానికి చెందిన రతీష్‌ మిషన్‌ భగీరథ పనులు చేస్తోన్న సంస్థలో ఉద్యోగం పొందాడు. అతడ్ని రెండేళ్ల క్రితం బాన్సువాడకు పంపారు. భార్య, కూతురితో కలిసి బాన్సువాడ టీచర్స్‌ కాలనీలో నివాసముంటూ, భగీరథ పనులను పర్యవేక్షిస్తున్నాడు. వృత్తిపరంగా ఎంతో చురుకుగా వ్యవహరించే రతీష్ తన పనితనంతో సంస్థలోని అందరి మన్ననలు పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందడంతో భార్య గుండెలవిసెలా రోదించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top