దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు


భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన బంగారు ఆభరణాలు శనివారం దొరికాయి. గర్భగుడిలో ఆభరణాలు భద్రపరిచే బీరువాలోనే ఇవి కనిపించడంతో ఊపిరి దదపీల్చుకున్నారు. దీంతో తొమ్మిది రోజులపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. దొరికిన ఆభరణాలను ఈవో రమేష్‌బాబు విలేకరులకు చూపించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. పంచనామా నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయాధికారులకు అప్పగించారు.


ఈ సందర్భంగా ఈవో రమేష్‌బాబు మాట్లాడుతూ కొందరు అర్చకుల తీరు వల్లే బంగారు ఆభరణాలు కనిపించలేదనేది యధార్థమన్నారు. అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో భద్రాద్రి రామాలయ ప్రతిష్టకు మచ్చతెచ్చే రీతిలో జరిగిన ఈ సంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కొందరు అర్చకులు కావాలనే ఇలా చేసినట్లు తేటతెల్లమవుతోందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్చకులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ప్రధాన బాధ్యులైన అర్చకులను సస్పెండ్ చేస్తామని, మిగతా వారిని వేర్వేరు ఆలయాలకు బదిలీ చేస్తామని ప్రకటించారు.



పోయిన చోటే కనిపించాయి..



దేవాదాయ శాఖ కమిషనర్ దీనిపై సీరియస్ కావటంతో పోయిన బంగారు ఆభరణాలను తిరిగి రాబట్టేందుకు దేవస్థానం ఈవో రమేష్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన శనివారం మరోమారు అర్చకులతో తన చాంబర్‌లో సమావేశ మయ్యారు. ఆలయ ప్రతిష్టను మరింత దిగజార్చకుండా ఆభరణాలు ఎక్కడున్నాయో గుర్తించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


దీంతో అర్చకులంతా గర్భగుడిలో వెతుకుతామని వెళ్లి.. బీరువాలోని మరో లాకర్‌లో ఆభరణాలు ఉన్నట్లు వాటిని తెచ్చి అధికారులకు చూపించారు. దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి పర్యవేక్షణలో గర్భగుడిలోని బీరువా, ఇతర లాకర్‌లను వెతికినప్పుడు కనిపించని బంగారు నగలు.. ఈవో హెచ్చరికతో అవి అక్కడే కనిపించినట్లు అర్చకులు చెప్పటం అనేక సందేహాలకు తావిస్తోంది. పోయిన ఆభరణాలు లభ్యమైనప్పటికీ దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top